టమాటా ధరలు ఆకాశాన్ని తాకినప్పటికీ అదే స్థాయిలో టమాటా పై సోషల్ మీడియాలో వేలుతున్న జోకులు కూడా యూజర్లను నవ్వు పుట్టిస్తున్నాయి. అయితే ఇదే ప్రచార అస్త్రంగా మార్చుకున్న కొంతమంది వ్యాపారులు కిలో ఫ్రీగా టమాటాలు ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అలాంటి సంఘటనల గురించి తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా టమాటా ధర దేశ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. టమాటా సామాన్యుల వంటగది నుంచి క్రమంగా దూరం అవుతోంది. ఆకాశాన్నంటుతున్న ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే టొమాటో ఇవ్వండి అంటూ జోకులు ఆన్ లైన్ లో పేలుతున్నాయి. అయితే ఈ విషయం కేవలం జోక్స్‌కే పరిమితం కాలేదు. తాజాగా కొంతమంది వ్యాపారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు టమాటాలను ఉచితంగా ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ మారింది.
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఓ ఫుట్ వేర్ దుకాణం యజమాని అద్భుతమైన పథకం అమల్లోకి తెచ్చాడు. సదరు బూట్ షాప్ యజమాని తన కస్టమర్లకు టమోటాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే అతని వద్ద రూ.1000 నుంచి 1500 వరకు షూలు కొనుగోలు చేసిన వారికి రెండు కిలోల టమోటాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం టమాటలు ఎక్కువ ధరకు అమ్ముడవుతుండటంతో ప్రజలు వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్నందున ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు దుకాణ యజమాని శ్యామ్‌లాల్ చెబుతున్నారు. తమ దుకాణంలో బూట్లు, చెప్పులు కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచితంగా టమోటాలు లభిస్తాయని తెలిపారు. అయితే ధరలు ఎక్కువగా ఉన్నంత కాలం టమాటాలను ఉచితంగా ఇచ్చే ఈ పథకం కొనసాగుతుందని శ్యామ్ లాల్ ప్రకటించారు..
సుమారు నెల రోజులు గడిచినా టమాటా ధరల్లో ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. ఒకప్పుడు కిలో రూ.10 నుంచి 30 వరకు విక్రయించే టమాటా ఇప్పుడు కిలో రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తుండగా, ఈ ధరకు కొనుగోలు చేసే సామర్థ్యం అందరికీ ఉండదు. కాబట్టి ఎవరైనా ఈ పథకంతో చెప్పుల దుకాణానికి సమీపంలో నివసిస్తుంటే, దాని ప్రయోజనాన్ని పొందవచ్చు. కొత్త బూట్లతో పాటు ఉచిత టమోటాలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయని నెట్టింట యూజర్లు కామెంట్స్ పెడుతున్నారు.
యూపీలోని బాగ్‌పత్ లో ఇలాంటి ఓ ఆశ్చర్యకరమైన ఆఫర్ తెరపైకి వచ్చింది. ఇక్కడ, ఒక గ్రామంలోని ఒక మొబైల్ షాప్ యజమాని వినియోగదారులకు ప్రత్యేకమైన ఆఫర్ ప్రకటించాడు. మొబైల్ కొంటే ఒక కేజీ టొమాటో ఉచితంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీనికి సంబంధించి కస్టమర్లు ఇదే బెస్ట్ ఆఫర్ అంటున్నారు. దీంతో మొబైల్ తో పాటు టమాటాలు కూడా ఇంటికి తీసుకెళ్లవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండే టమాటా ధరలు ప్రస్తుతం తగ్గే సూచనలు పెద్దగా కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా టమాటా ధరలు పెరగడానికి ప్రధాన కారణం టమోటా ఉత్పత్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గత సీజన్లో పంటలు దెబ్బ తినడమే కారణమని చెబుతున్నారు. కొత్త పంట వచ్చేందుకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని అప్పటివరకు ధరలు ఇదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.