దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతోంది. దీంతో సామాన్యుడు తినే పళ్లెం నుంచి టమాటా దూరం అవుతోంది. ప్రస్తుతం టమాటా ధర 100 రూపాయలు దాటడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి కారణం ఏంటి అసలు టమాటా ధర ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దక్షిణ భారతదేశంలోనే కాదు దేశవ్యాప్తంగా టమాటా ధర భారీగా పెరిగింది. సోమవారం దేశంలోని చాలా మార్కెట్లలో కిలో టమాట ధర రూ.100 దాటింది. బెంగళూరులోని కొన్ని స్టోర్లలో దీని ధర రూ.110కి చేరింది. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాట రూ.65-70 వరకు విక్రయిస్తున్నారు. వారం రోజుల క్రితం ఇదే టమాటా కిలో రూ.30 నుంచి 35 పలికింది. వారం రోజుల్లోనే దీని ధర రెట్టింపు కావడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. దేశంలోనే అత్యధికంగా టమాటాకు డిమాండ్ ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో మే నెలలో టమాటా డిమాండ్ కిలోకు రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. ఈ లెక్కన ఒక్క నెలలో టమాటా రేటు 1900 శాతం పెరిగింది.
ఢిల్లీలో టమాట కిలో రూ.70 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ మార్కెట్‌లో రూ. 80 నుంచి రూ. 100, ఉత్తరప్రదేశ్‌లో రూ. 80 నుంచి రూ. 100, రాజస్థాన్‌లో రూ. 90 నుంచి రూ. 110, పంజాబ్‌లో రూ. 60 నుంచి రూ. 80, కర్ణాటకలో 70 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు. దేశం మొత్తం టమోటాల కోసం మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలపై ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రాల్లో మార్పులు దేశ వ్యాప్తంగా టమోటా ధరలపై ప్రభావం చూపుతాయి.
టమాటా ధరలు పెరగడానికి కారణమేంటి ? :
పలు రాష్ట్రాల్లో వర్షాల రాకతో టమాటా పంట దెబ్బతింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ విపరీతమైన వేడిని అనుభవిస్తున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గింది. దానికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటకు సరిపడా రావడం లేదు. మరీ ముఖ్యంగా గతేడాదితో పోలిస్తే ఈసారి దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో టమాటా పంటను రైతులు పండించలేదు. దేశంలో గుజరాత్ , మహారాష్ట్ర ప్రధాన టమాట సరఫరాదారులు, ఈసారి బిపర్జాయ్ తుఫాను కారణంగా నష్టపోయారు.
పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ సరఫరా, అధిక రవాణా ఖర్చు:
వారం రోజుల్లో టమాటా ధరలు రెట్టింపు అయ్యాయని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌కు చెందిన టమోటా వ్యాపారి అశోక్ గనోర్ తెలిపారు. దీనికి కారణం హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి టమాటా కొరతతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి టమోటాలు తీసుకురావడంతో రవాణా ఖర్చులు పెరిగాయి. మే నెలలో టమాట ధర కిలో రూ.2 కు పడిపోయిందని మహారాష్ట్రలోని నారాయణగావ్‌కు చెందిన రైతు అజయ్ బెల్హెకర్ తెలిపారు. సరైన ధర లేకపోవడంతో రైతులు పంటకు పురుగుమందులు, ఎరువులపై పెట్టుబడి పెట్టలేకపోయారు. దీంతో పంటకు చీడ పెరిగి ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా ధర పెరిగిందన్నారు.
త్వరలోనే టమాటా ధర తగ్గే అవకాశం..
కొత్త పంటగా పండిన టమాట వల్ల 1-2 నెలల్లో ధర తగ్గే అవకాశం ఉంది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకారం, ఒక టమాటా మొక్క మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడు, అది వారానికి రెండుసార్లు టమోటాలు ఉత్పత్తి చేస్తుంది. ఈ మొక్కలు 1-2 నెలలు ఫలాలను ఇస్తాయి. ఇది నేల, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
చైనా తర్వాత భారతదేశం అతిపెద్ద టమోటా ఉత్పత్తిదారు:
నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ప్రకారం, చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద టమోటా ఉత్పత్తిదారుగా భారతదేశం ఉంది. ఇది సుమారు 7.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 20 మిలియన్ టన్నుల టమోటాను ఉత్పత్తి చేస్తుంది. హెక్టారుకు సగటున 25.05 టన్నుల దిగుబడిని ఇస్తుంది. 56 మిలియన్ టన్నుల ఉత్పత్తితో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రధానంగా మన దేశంలో రెండు రకాల టమోటాలు పండిస్తారు. మధ్యప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా టమోటా ఉత్పత్తి చేసే రాష్ట్రం కాగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.