థామస్ కుక్‌కు బెయిలౌట్ ఇవ్వలేం: బోరిస్ జాన్సన్.. ఎందుకంటే..

By Siva KodatiFirst Published Sep 23, 2019, 4:31 PM IST
Highlights

175 ఏళ్ల విమాన యాన సంస్థ థామస్ కుక్ దివాళా ప్రకటించింది. కానీ దాన్ని ఆదుకునేందుకు బెయిలౌట్ ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిరాకరించారు. సంస్థ డైరెక్టర్ల వల్లే నష్టాలు వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు బ్రిటన్ సర్కార్ తిరస్కరించింది. కంపెనీ నష్టాలకు డైరెక్టర్లు కారణమనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనుమానం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడానికి వెళుతూ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 

థామస్ కుక్ కంపెనీకి బెయిల్ అవుట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం లేదని తేల్చి చెప్పారు. కంపెనీ డైరెక్టర్లపై కఠిన నిబంధనలు అమలు చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది.

కంపెనీకి బెయిల్ అవుట్ ఇవ్వడమంటే.. నైతికతకు వచ్చిన ఆపదగా ఆయన అభివర్ణించారు. అదంతా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ధనమని జాన్సన్ అన్నారు.
 
ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి థామస్ కుక్ కంపెనీ చివరి వరకు ప్రయత్నించింది. అదనపు అప్పుల కోసం చైనాకు చెందిన ఫోసన్ టూరిజం గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైంది. ముందుగా 900 మిలియన్ పౌండ్లకు ఒప్పందం కుదిరింది. 

ఆ తర్వాత మరో 200 మిలియన్ పౌండ్లు అదనంగా ఇవ్వాలని ధామస్ కుక్ కంపెనీ కోరింది. దీనికి ఫోసన్ అంగీకరించలేదు. దీంతో ఒప్పందం రద్దయ్యింది. 
 
మరోవైపు థామస్ కుక్ కంపెనీ దివాలా తీయడంపై థామస్ కుక్ ఇండియా స్పందించింది. దాని ప్రభావం తమపై ఉండదని తేల్చి చెప్పింది. థామస్ కుక్ ఇండియాను ఫెయిర్ ఫాక్స్ కంపెనీ 2012లో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

బ్రిటిష్‌ పర్యాటక సంస్థ థామస్‌కుక్‌ కుప్పకూలింది. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాళా ప్రకటించడంతో వేలాదిమంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌కుక్‌ దివాలా  తీసింది.

ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్‌ తన విమాన సేవలను నిలిపివేసినట్టుగా బ్రిటిష్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రకటించింది. థామస్‌కుక్‌కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్టు ప్రకటించింది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా 22వేల ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయి. వీరిలో 9వేల మంది బ్రిటన్‌ వారు ఉన్నారు. అంతేకాదు వేలాదిమంది ప్రయాణీకులు ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. 

సంస్థ పతనం తీవ్ర విచారం కలిగించే విషయమని థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ ఆదివారం రాత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక చరిత్ర ఉన్నసంస్థ దివాలా ప్రకటించడం సంస్థలకు, లక్షలాది కస్టమర్లకు, ఉద్యోగులకు చాలా బాధ కలిగిస్తుందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పారు. 

తప్పనిసరి లిక్విడేషన్‌లోకి ప్రవేశించిందంటూ కస్టమర్లు, వేలాదిమంది ఉద్యోగులకు థామస్ కుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ ఫాంక్‌హౌజర్ క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఇది చాలా విచారకరమైన వార్త అని  బ్రిటన్‌ రవాణా కార్యదర్శి గ్రాంట్ షాప్స్ చెప్పారు.

అలాగే పర్యాటకులను, కస్టమర్లను వారివారి గమ్యస్థానాలకుచేర్చేందుకు ఉచితంగా 40కి పైగా చార్టర్‌ విమానాలను సీఏఏ అద్దెకు తీసుకుందని  తెలిపారు. 

కాగా ప్రపంచంలోని ప్రసిద్ధ హాలిడే బ్రాండ్లలో ఒకటైన థామస్‌ కుక్‌ను 1841లో లీసెస్టర్స్‌ షైర్‌లో క్యాబినెట్-మేకర్ థామస్ కుక్ స్థాపించారు.

ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో నష్టాలు భారీగా పెరగనున్నాయని ఈ ఏడాది మేలోనే థామస్‌ కుక్‌ వెల్లడించింది. బ్రెగ్జిట్‌ అనిశ్చితి కారణంగా సమ్మర్‌ హాలిడే బుకింగ్స్‌ ఆలస్యం కావడంతో సంక్షోభం మరింత ముదిరింది. 

click me!