పుట్టల్లోంచి బయటకు వస్తున్న 2వేల నోట్లకట్టలు..జొమాటోకు 2వేల నోట్ల సెగ..2 వేల నోట్లతో బంగారం కొనేస్తున్న జనం

By Krishna Adithya  |  First Published May 24, 2023, 5:03 PM IST

మార్కెట్లో 2000 రూపాయల నోటును మార్చుకునేందుకు జనం అంతగా ఆసక్తి చూపించడం లేదు కేవలం ఎస్బిఐ బ్యాంకు లో మాత్రమే జనాలు తమ నోట్లను మార్చుకునేందుకు కొద్దిగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నోట్లను మార్చుకోవడం కన్నా కూడా మార్కెట్లో ఖర్చు పెట్టడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.


2000 నోటు ఉపసంహరణ తర్వాత ఒక్కసారిగా మార్కెట్లో 2000 నోటు సందడి చేయడం మొదలుపెట్టింది తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ zomato ట్వీట్ చేస్తూ తమ సంస్థకు మంగళవారం వచ్చినటువంటి ఆర్డర్లలో 70 శాతం వరకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు వచ్చాయని,  తమ కస్టమర్లు అంతా 2000 రూపాయల నోట్లనే డెలివరీ బాయ్స్ కు అందించారని సరదాగా ట్వీట్ చేసింది కానీ ఇది వాస్తవం.  ప్రజలు బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లు మార్చుకోవడం కన్నా కూడా ఇలా మార్కెట్ లోనే సర్కులేట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి అర్థం అవుతోంది.  ముఖ్యంగా 2000 రూపాయల నోటు రద్దు చేయలేదని ఇప్పటికే ఆర్బిఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.  అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై  రిజర్వ్ బ్యాంకు స్పందించింది. 

ఎలాంటి గుర్తింపు కార్డు, వివరాలు ఇవ్వకుండానే నోట్లు మార్చుకోవచ్చు...

Latest Videos

మరోవైపు SBI సహా పలు బ్యాంకులు ప్రజలు 2000 రూపాయల నోట్లను మార్చుకునే వెసులుబాటు  ఎలాంటి గుర్తింపు కార్డు, ఫారం నింపడం అవసరం   లేకుండానే నోట్లను స్వేచ్ఛగా మార్చుకోవచ్చని తెలిపాయి. అంతేకాదు ఏదైనా బ్రాంచ్ లో మార్చుకోవచ్చని ఆ బ్రాంచ్ లో ఖాతా ఉండాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు బ్యాంకులు సైతం తెలిపాయి. అయినప్పటికీ ప్రజలు 2000 రూపాయలు నోటును లావాదేవీలకే ఎక్కువగా మార్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో వ్యాపారులు సైతం 2000 రూపాయల నోటును తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు.  అయితే 2000 రూపాయల నోటు  రద్దు కాలేదని చలామణిలోనే ఉందని ఆర్బిఐ తెలపటం విశేషం. 

SBI లో మాత్రమే 2000 నోట్లు మార్చుకుంటున్న జనం..

అయితే తొలి రోజు అయినా మంగళవారం ఎస్బిఐ మినహా ఇతర బ్యాంకుల్లో అంతగా రద్దీ కనిపించలేదు ఎందుకంటే ఎస్బిఐ తాము ఎలాంటి గుర్తింపు పత్రాలను అడగడం లేదని స్వేచ్ఛగా వచ్చి 20,000 విలువైన 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది.  అయితే ఇతర బ్యాంకుల నుంచి  క్రింది స్థాయి బ్రాంచీలకు ఆ విధంగా హామీ ఇంకా లభించలేదు.  దీంతో పెద్దగా జనం ఆయా బ్యాంకుల్లో 2000 నోట్లను మార్చుకునేందుకు ఆసక్తి చూపలేదు.  అయితే 2000 రూపాయల నోట్లను కొన్ని బ్యాంకుల్లో తమ ఖాతాల్లో వేసుకోమని బ్యాంకు సిబ్బంది సూచించారు. 

2000 నోట్లతో ఖరీదైన వాచీలు, బంగారం కొనేస్తున్న జనం

 ఇక కొన్ని మార్కెట్లలో అయితే 2000 రూపాయల నోట్లను ఉపయోగించి ఖరీదైన వాచీలు,  మొబైల్ ఫోన్లు,  బంగారు ఆభరణాలు కొనేస్తున్నారు.  దీంతో వ్యాపారులు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.  అయితే 2000 రూపాయల నోటు ఇంకా రద్దు కాలేదు అనే భరోసా ఉండటంతో కొందరు వ్యాపారులు మాత్రం తమ వ్యాపారం సరుకు అమ్ముడుపోతోందని సంతోషంగానే నగదు తీసుకుంటున్నారు ముంబైలోని పలు మార్కెట్లలో ఖరీదైన ఐఫోన్లు,  బంగారు ఆభరణాలు,  వజ్రాభరణాలు కొనేందుకు జనం ఆసక్తి చూపించారు. ముంబై కి చెందిన ప్రముఖ లగ్జరీ వాచీల బ్రాండ్ రాడో షో రూమ్ లో 2000 రూపాయల నోట్లు చెల్లించి ఖరీదైన వాచీలను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇక పెట్రోల్ బంకుల్లో అయితే సరే సరి ఫుల్ ట్యాంక్ పట్టించుకోని 2000 రూపాయల నోటు చేతిలో పెడుతున్నారు.  దీంతో పెట్రోల్ బంక్ యజమానులు ఏం చేయాలో పాలు పోక తెల్ల మొహం వేస్తున్నారు. 

ఇక కొన్ని నిర్మాణ సంస్థలో తమ వద్ద పనిచేసే లేబర్ కు రోజువారి కూలీని  2000 రూపాయల నోట్ల రూపంలో చెల్లిస్తున్నారు. అదేంటి అని అడుగుతే బ్యాంకులో కెళ్ళి మార్చుకోమని దబాయిస్తున్నారు.  ఈ పరిస్థితి హైదరాబాదులోని పలువురు కూలీలు మీడియాతో వాపోయారు. 

మరోవైపు వ్యాపారస్తులు తమకు వస్తున్నటువంటి 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు వెసులుబాటు కల్పించాలని ఇప్పటికే ఆర్బిఐ ను కోరుతున్నాయి.  అయితే సెప్టెంబర్ 30 వరకు నోట్ల మార్పిడికి తేదీ ఉండటంతో వ్యాపారులు పెద్దగా ఆందోళన చెందడం లేదు. 

 

click me!