బంగారం ధర గత వారం రోజులుగా భారీగా పతనం అవుతోంది. అమెరికా మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్ పై కూడా చూపిస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే పసిడి ధర భారత మార్కెట్లో 55000 దిగువకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి
US ఫెడరల్ రిజర్వ్ నుండి బుధవారం (జూలై 26) వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచారు. మార్కెట్ కూడా దీని కోసమే ఎదురుచూసింది. ఫెడ్ తన గత 12 సమావేశాల్లో 11వ సారి వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. ఈ విధంగా, అమెరికాలో వడ్డీ రేటు 22 సంవత్సరాల గరిష్ట స్థాయికి అంటే 2001కి పెరిగింది. గతంలో జూన్‌లో జరిగిన సమావేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం బంగారం ధరలపై వెంటనే ప్రభావం చూపలేదు, కానీ గురువారం, USలో బంగారం ధర 1.5 శాతం బలహీనపడి రెండు వారాల కనిష్టానికి చేరింది.
మరోవైపు US ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరోసారైనా వడ్డీ రేట్లను పెంచవచ్చు, తద్వారా ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యం కంటే దిగువకు తీసుకురావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ గణాంకాల రాక తర్వాత, US డాలర్ ఇండెక్స్, US బాండ్ ఈల్డ్ రెండూ బలపడ్డాయి. ఈ కారణంగానే గురువారం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
US డాలర్ ఇండెక్స్‌లో బలబడే కొద్ది బంగారం ధరలను తగ్గిస్తుంది. US డాలర్ ఇండెక్స్ గత వారం 0.60 శాతం లాభపడింది. అదేవిధంగా, 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 3 శాతం పెరిగి 3.96 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో, US గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం నాడు 0.8 శాతం పెరిగి ఔన్సు 1960.40 డాలర్ల వద్ద ముగిసింది.
ఇదిలా ఉంటే దేశీయ మార్కెట్‌లో, MCXలో బెంచ్‌మార్క్ గోల్డ్ ఆగస్టు కాంట్రాక్ట్ శుక్రవారం నాడు రూ.440 లేదా 0.75 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.59,390 వద్ద ముగిసింది. గురువారం, ఆగస్టు కాంట్రాక్ట్ ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 10 గ్రాములకు రూ. 58,740కి చేరుకుంది, ముందు 10 గ్రాములకు రూ.58,950 వద్ద ముగిసింది.
అంతకుముందు మే 4, 2023న, MCXలో బెంచ్‌మార్క్ గోల్డ్ జూన్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ. 61,845 వద్ద ఆల్ టైమ్ హైకి పెరిగింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల (999) బంగారం ధర రూ. 250 తగ్గి 10 గ్రాములకు రూ.59,491 వద్ద ముగిసింది. కాగా గురువారం 59,741 వద్ద ముగిసింది.
ఇదిలా ఉంటే మార్కెట్లో బంగారం ధర భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 55000 దిగువకు దిగివచ్చే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నారు. అమెరికా డాలర్ ఎంత బలపడితే బంగారం ధర అంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా బాండ్ విలువ కూడా పెరిగే కొద్దీ మధుపరులు బంగారం నుంచి తమ పెట్టుబడులను బాండ్ మార్కెట్ వైపు తరలించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.