
రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం నమోదైంది. ముంబైలో మళ్లీ భారీ రియల్ ఎస్టేట్ డీల్ వార్తల్లోకెక్కింది. బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ సముద్రానికి అభిముఖంగా ట్రిప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపారవేత్తలకు నిలయమైన ముంబైలోని మలబార్ హిల్‌లో మాక్రోటెక్ డెవలపర్స్ నిర్మించిన లగ్జరీ పెంట్‌హౌస్‌ను రూ.252.5 కోట్లకు ఆయన కొనుగోలు చేసినట్లు వార్త ఒకటి వెలువడింది.
గతంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా, అవెన్యూ సూపర్‌మార్ట్స్ చైర్మన్ రాధాకృష్ణ ధమానీ కూడా విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేశారు. మే 1, 2021 నుండి బజాజ్ ఆటో ఛైర్మన్‌గా ఉన్న నీరజ్ బజాజ్, మార్చి 13న దీనిని కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మూడు అపార్ట్‌మెంట్‌ల మొత్తం వైశాల్యం 18,008 చదరపు అడుగులు (కార్పెట్ ఏరియా 12624 చదరపు అడుగులు) ఎనిమిది కార్ పార్కింగ్ స్లాట్‌లు ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్లు 31 అంతస్తుల లోధా మలబార్ ప్యాలెస్‌లో ఉన్నాయి. ఈ డీల్ కోసం రూ.15.15 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు ఓ న్యూస్ రిపోర్ట్ ద్వారా తెలిసింది
ఫిబ్రవరిలో వెల్స్పన్ గ్రూప్ ఛైర్మన్ బికె గోయెంకా వర్లీలోని ఒబెరాయ్ రియల్టీ లగ్జరీ ప్రాజెక్ట్ త్రీ సిక్స్టీ వెస్ట్‌లో రూ. 230 కోట్లతో పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, గోయెంకా ఇల్లు B టవర్ , 63వ అంతస్తులో ఉంది , 29,885 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతంలో విస్తరించి ఉంది. అపార్ట్మెంట్ 4,815 చదరపు అడుగుల విస్తీర్ణం, 411 చదరపు అడుగుల అదనపు విస్తీర్ణం ఉంది. .
గత నెలలో డీమార్ట్ యజమాని అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ దాదాపు 28 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసేందుకు రూ.1,238 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇది భారతదేశపు అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్‌లో ఒకటి అని మనీకంట్రోల్ పోర్టల్ పేర్కొంది. ఫిబ్రవరి 3న ముంబైలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం కార్పెట్ ఏరియా 1,82,084 చదరపు అడుగులతో లావాదేవీలు నమోదయ్యాయి. డి మార్ట్‌కు అధినేత అయిన దమానీ రూ.1,200 కోట్లతో 28 లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు.
స్థానిక బ్రోకర్ల ప్రకారం, ఇటీవల లోధా ప్రాపర్టీస్ తన లగ్జరీ ప్రాజెక్ట్‌లను తిరిగి ప్రారంభించింది. ఒక్కో అపార్ట్‌మెంట్ కనిష్ట పరిమాణం 9 వేల చదరపు అడుగులు అని, ఒక్కో యూనిట్ ధర 100 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. అయితే, నీరజ్ బజాజ్ పెంట్‌హౌస్ కొనుగోలుకు సంబంధించి బిల్డర్లు , కొనుగోలుదారుల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు.
పట్టణ ప్రాంతాల్లో లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుదారుల విభాగం మార్చి 31, 2023 వరకు ఎక్కువగానే ఉంటుందని స్థానిక బ్రోకర్లు తెలిపారు. ఫిబ్రవరి 1 నాటి బడ్జెట్ 2023లో ప్రకటించిన కొన్ని నిబంధనల కారణంగా, వ్యాపారవేత్తలు లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని బ్రోకర్లు చెబుతున్నారు.