TCS Q4 takeaways: టీసీఎస్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఆదాయం.. కొత్తగా 40,000 ఉద్యోగాలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 12, 2022, 12:15 PM IST
TCS Q4 takeaways: టీసీఎస్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఆదాయం.. కొత్తగా 40,000 ఉద్యోగాలు..!

సారాంశం

దేశంలోనే అతిపెద్ద సాఫ్ట‌వేర్ కంపెనీ అయిన టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ (TCS) రికార్డు సృష్టించింది. 2021-22 చివ‌రి త్రైమాసికంలో రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో ఇంత ఆదాయాన్ని ఆర్జించ‌డం ఇదే తొలిసారి. నిక‌ర లాభం రూ. 9,926 కోట్లకు చేరింది.    

ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయం పరంగా అదరగొట్టింది. అలాగే, మొదటిసారి రూ.50,000 మార్కును దాటింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.9,926 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది ప్రాతిపదికన ఇది 7.4 శాతం వృద్ధి. కంపెనీ మొత్తం ఆదాయం రూ.50 వేల కోట్లు దాటింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021-22లో టీసీఎస్ ఆదాయం రూ.50,591 కోట్లు.

ఒక త్రైమాసికంలో ఆదాయం రూ.50వేల కోట్ల మార్కు దాటడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఆదాయం రూ.1,91,754 కోట్లుగా నమోదయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 16.8 శాతం అధికం. వార్షిక లాభం 3.2 శాతం వృద్ధితో రూ.38,327 కోట్లుగా నమోదయింది. రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుకు రూ.22 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. కంపెనీ ఫలితాలకు ముందు టీసీఎస్ షేర్ నిన్న 0.36 శాతం లాభపడి రూ.3,699 వద్ద ముగిసింది.

టీసీఎస్ ఆర్డర్లు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఆర్డర్ బుక్ టీసీవీ (టోటల్ కాంట్రాక్ట్ వ్యాల్యూ) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 11.3 బిలియన్ డాలర్లుగా నమోదయింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆర్డర్ బుక్ 34.6 బిలియన్ డాలర్లుగా నమోదయింది. టీసీఎస్ వృద్ధిలో కన్స్యూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ 22.1 శాతం, మ్యానుఫ్యాక్చరింగ్ వర్టికల్ 19 శాతం, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా 18.7 శాతం, టెక్నాలజీ అండ్ సర్వీసెస్ 18 శాతం, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 12.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.03 లక్షల మంది ఉద్యోగులను తీసుకున్నది. టీసీఎస్ చరిత్రలో ఇదే గరిష్టం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనే 35,209 నియామకాలు చేపట్టింది. FY21 మొత్తానికి 40,000 నియామకాలు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40,000 ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. FY22లో కేవలం ఫ్రెషర్స్ 78,000 వరకు ఉన్నారు. అయితే కంపెనీని ఆట్రిషన్ రేటు ఆందోళనకు గురి చేస్తోంది. కంపెనీ ఆట్రిషన్ 17.4 శాతానికి పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 8.6 శాతంగా ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 11.9 శాతానికి పెరిగింది. గత త్రైమాసికంలో మరింత పెరిగింది.

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు