
అంబానీ పొరుగు ఇంట్లో ఉంటున్నారంటే అతను కచ్చితంగా కోటీశ్వరుడే అయి ఉంటాడు. ఆ విషయాన్ని మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజమే అంబానీ పొరుగున ఉన్న ఒక పెద్ద భవంతిలో పెంట్ హౌస్‌ను కొన్నారు ఓ సెలెబ్రిటీ. విశాలమైన ఆ ఇంటి కోసం 98 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. అతడు ఒక రైతు బిడ్డ. ఇప్పుడు దేశంలోని కోటీశ్వరులలో ఒకరిగా మారిపోయారు. అతని పేరు ఎన్. చంద్రశేఖరన్. ఆయన ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్.
టాటా పేరు వింటేనే ప్రజలకు ఎంతో నమ్మకం. అందుకే ఆ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. రతన్ టాటాకు సన్నిహితుడు చంద్రశేఖరన్. ప్రస్తుతం ఆయనే టాటా గ్రూపుకు నాయకత్వం వహిస్తున్నారు. టాటా కంపెనీ ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టి రాణిస్తోంది. వేలకోట్ల విలువైన కంపెనీని నడిపిస్తున్న చంద్రశేఖరన్ ఒక రైతు బిడ్డ. ఒకప్పుడు ఉద్యోగం కోసం వచ్చి టాటా కంపెనీలో ఇంటర్న్ గా చేరారు. ఇప్పుడు అదే టాటా కంపెనీకి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు.
చంద్రశేఖరన్ తమిళనాడులోని మోహనూర్ అనే గ్రామంలో పుట్టారు. అతని తండ్రి ఒక రైతు. కోయంబత్తూర్లో అప్లైడ్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత తిరుచ్చి ఎన్ఐటీలో ఎంసీఏ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం 1987లో టాటా కంపెనీలోకి వచ్చారు. ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి టాటా సంస్థను వదిలిపెట్టలేదు. టిసిఎస్ కు సీఈవోగా 2009లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2017 నుంచి టాటా సన్స్ చైర్మన్‌గా ఉంటున్నారు.
ప్రస్తుతం చంద్రశేఖరన్ ముంబైలోనే ముకేశ్ అంబానీ ఇంటి ఎదురుగానే ఉంటున్నారు. ఈయన 2022లో ఒక విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. దాని ధర అక్షరాలా 98 కోట్ల రూపాయలు. దక్షిణ ముంబైలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఎంతో విలాసవంతమైనది. మొదట ఈ ఫ్లాట్‌ను చంద్రశేఖరన్ అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత తనకు నచ్చడంతో 98 కోట్ల రూపాయలు చెల్లించి మరీ కొనుగోలు చేశారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా ఈ ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు. చంద్రశేఖరన్ కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దానికి ప్రైవేట్ లిఫ్టు, లగ్జరీ కార్ పార్కింగ్, సెంటర్ క్లబ్ హౌస్ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అలాగే సముద్రం కూడా అందంగా కనిపిస్తుంది.
చంద్రశేఖరన్ జీతం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన జీవితం ఏడాదికి 155 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. భారతదేశంలో అత్యధిక జీతాన్ని పొందుతున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు ఆయన ఆస్తులు విలువ 858 కోట్ల రూపాయలకు పైగానే ఉంది