భారతీయ అమెరికన్ సుందర్ పిచాయ్ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్లు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. తాజా ప్రమోషన్‌తో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు పిచాయ్.
న్యూయార్క్: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా భారతీయ-అమెరికన్ సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్.. ఆల్ఫాబెట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం గూగుల్ సీఈఓగా ఉన్న సుందర్ పిచాయ్ తాజా ప్రమోషన్‌తో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు.
లారీ పేజ్, సెర్గీ బ్రిన్.. తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ప్రస్తుతం ఆల్ఫాబెట్ స్థిరపడిందని, గూగుల్ ఇతర అనుబంధ సంస్థలు స్వతంత్రంగా, సమర్థవంతంగా పని చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో సంస్థను సమర్థవంతంగా నడిపే ఇతర మార్గాలు ఉన్నప్పుడు తాము ఇదే పదవుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు.
also read జియో... కస్టమర్లందరూ ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది....
గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆల్ఫాబెట్, గూగుల్‌లకు ఇకపై ఇద్దరు సీఈఓలు, ప్రెసిడెంట్ ఉండనవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందర్ పిచాయ్ మాత్రమే సీఈఓగా ఉంటారు. గూగుల్ కార్యనిర్వహక బాధ్యతలు నిర్వహిస్తారు. సంస్థ తరఫున జవాబుదారీగా ఉంటారు’ అని తెలిపారు.
గూగుల్ సీఈఓగా, ఆల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యునిగా సుందర్ పిచాయ్ 15 సంవత్సరాలు తమతో కలిసి పనిచేశారని లారీ పేజ్, సెర్గీ బ్రిన్ తెలిపారు. ఆల్ఫాబెట్ నిర్మాణ విలువపై పిచాయ్ తమ విశ్వాసాన్ని నిలుపుతారని వారు అభిప్రాయపడ్డారు. ఆల్ఫాబెట్ సీఈఓ మార్పుతో సంస్థ నిర్మాణాన్ని, రోజువారీ పనిని ఏమాత్రం ప్రభావితం చేయదని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు.
also read రియల్‌మీ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గించిన ఫోన్ ధరలు
"నేను గూగుల్‌పై మరింతగా దృష్టి కేంద్రీకరిస్తాను. కంప్యూటింగ్ సరిహద్దులను మరింతగా విస్తరించడానికి, ప్రతి ఒక్కరికీ సహాయకరంగా ఉండేలా గూగుల్‌ను రూపొందించడానికి కృషి చేస్తాను. అదే సమయంలో.. నేను ఆల్ఫాబెట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. దీర్ఘకాలిక దృష్టితో నూతన సాంకేతికతల ద్వారా పెద్ద సవాళ్లను సైతం ఎదుర్కొనేందుకు సంస్థ కృషి చేస్తుంది’ అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.