జెట్ నిపుణులకు ‘స్పైస్’ చేయూత: నిపుణులకు కొలువులు

By rajesh yFirst Published Jun 3, 2019, 11:40 AM IST
Highlights

మూలనపడ్డ జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి ప్రత్యేకించి నిపుణులకు స్పైస్ జెట్ ఊరట కల్పిస్తోంది. తాజాగా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తలపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తన సామర్థ్యం 80 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌ తెలిపారు.

సియోల్‌: ఆర్థిక సంక్షోభంతో మూలన బడ్డ జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి మరో విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ ఊరట కల్పిస్తోంది. జెట్ ఎయిర్వేస్‌లో  పని చేస్తున్న పైలట్లు, క్యాబిన్‌ సిబ్బందితోపాటు దాదాపు 2,000 మంది నిపుణులకు తమ సంస్థలో అవకాశం కల్పిస్తున్నామని స్పైస్‌జెట్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) అజయ్‌ సింగ్‌ చెప్పారు.

నిధుల కొరతతో ఏప్రిల్‌ 17న జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ నిర్వహించిన విమానాల్లో 22 స్పైస్‌జెట్‌ ఆధీనంలోకి చేరాయి. 

విమానాలు, సర్వీసుల విస్తరణకనుగుణంగా సిబ్బందిని నియమించుకుంటున్నట్లు  స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. నిపుణులను జెట్‌ ఎయిర్‌వేస్‌లో అందుబాటులో ఉన్నందున, ఇప్పటికే 1100 మందిని తీసుకున్నామని తెలిపారు. త్వరలో ఉద్యోగాల నియామకాల సంఖ్య 2,000 మందికి చేరుతుందని అంచనా వేస్తున్నాం అని తెలిపారు. 

ప్రస్తుతానికి వెడల్పు తక్కువగా ఉండే విమానాలపైనే దృష్టి సారించాం అని స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ విమాన కేంద్రంగా భారత్‌ మారినప్పుడు దీర్ఘకాలం ప్రయాణించే విమానాలు నిర్వహిస్తాం అని అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ సీట్ల సామర్థ్యాన్ని 80 శాతం మేర విస్తరిస్తున్నామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ వివరించారు. ఇందులో అధికం లీజ్‌ ద్వారానే ఉంటుందని, అందువల్ల నిధులు భారీగా అవసరం ఉండదన్నారు. 

విమానాల లీజ్‌ బ్యాక్‌కు తోడు, ఆఫర్‌ విక్రయాల వల్ల సీట్లు భారీగా ముందుగానే విక్రయించడంతో నగదు లభ్యత బాగుందని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. అందువల్ల కొత్తగా నిధులు సమీకరించే యోచనలేదని, ఈ ఏడాది లాభార్జన బాగుంటుందనే ఆశిస్తున్నాం అని అజయ్‌ సింగ్‌ వివరించారు.

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) బోర్డులోకి స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. 290 విమానయాన సంస్థలకు సభ్యత్వం గల ఈ అంతర్జాతీయ గ్రూప్‌లో సంస్థ చేరిన మూడు నెలలల్లోనే అజయ్‌సింగ్‌కు ఈ పదవి దక్కింది. మూడేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు. 
గతంలో ఈ బోర్డులో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ దీర్ఘకాలం ఉన్నారు. లుఫ్తాన్సా గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్‌స్టెన్‌ ఐఏటీఏ బోర్డుకు ఆధ్వర్యం వహిస్తున్నారు. బోర్డులో ఎయిర్‌ కెనడా, క్యాంటాస్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓలు ఇతర సభ్యులు. 

అంతర్జాతీయ విమానయాన రంగం 2019లో 28 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.96 లక్షల కోట్ల) లాభాలు ఆర్జించవచ్చని ఐఏటీఏ తాజాగా అంచనా వేసింది. గత ఏడాది వేసిన అంచనాల్లో లాభాలు 35.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.48 లక్షల కోట్లు) ఉండొచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇంధన ధరలు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల విమానయాన రంగ వ్యాపారంపై ప్రభావం పడుతోందని తెలిపింది. వచ్చే 20 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్యలో లభించే వృద్ధిలో సగం మేర భారత్‌, చైనాల నుంచే ఉంటుందని ఐఏటీఏ పేర్కొంది. 

భారత్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణికుల సంఖ్యలో అభివృద్ధి తగ్గడం తాత్కాలికమేనని, క్రమేణ పెరుగుతుందని ఐఏటీఏ ముఖ్య ఆర్థికవేత్త బ్రియాన్‌ పియర్స్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్త ప్రయాణికుల వృద్ధిలో 45 శాతం భారత్‌, చైనాల నుంచే లభిస్తుందన్నారు.

అన్ని ఆదాయ వర్గాల నుంచీ గిరాకీ అధికమవుతుందని ఐఏటీఏ ముఖ్య ఆర్థికవేత్త బ్రియాన్‌ పియర్స్‌ వివరించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు నిలిచిన నేపథ్యంలో, ఎయిరిండియాకు గిరాకీ పెరుగుతుందని స్టార్‌ అలయన్స్‌ సీఈఓ జెఫ్రీ అంచనా వేశారు.

click me!