స్టాక్స్‌ను వెంటాడిన చమురు సెగ.. ఐటీ మినహా అన్ని నేల చూపులే

By sivanagaprasad kodatiFirst Published Nov 13, 2018, 7:35 AM IST
Highlights

ఫారెక్స్‌, ఆయిల్‌ మార్కెట్ల ప్రభావం సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై పడింది. ముడిచమురు ధరలు మరోసారి అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ 71.62 డాలర్లకు చేరడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తిరిగి క్షీణించి 73 స్థాయి కన్నా దిగజారడం మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. 

ఫారెక్స్‌, ఆయిల్‌ మార్కెట్ల ప్రభావం సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై పడింది. ముడిచమురు ధరలు మరోసారి అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ 71.62 డాలర్లకు చేరడం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తిరిగి క్షీణించి 73 స్థాయి కన్నా దిగజారడం మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలపై కూడా గురి పెట్టిన మార్కెట్‌వర్గాలు అప్రమత్తంగా వ్యవహరించాయి.

అయినా స్టాక్ మార్కెట్లలో భారీ ఆటుపోట్లు చోటు చేసుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్‌ అంతర్గత ట్రేడింగ్‌లో 576 పాయింట్ల పరిధిలో ఆటుపోట్లు చవి చూసింది. ఐటీ మినహా ఆటో, ఆయిల్‌/గ్యాస్‌, పీఎ్‌సయూ, బ్యాంకింగ్‌ స్టాక్‌లన్నీ భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. 
 
ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న ఒపెక్‌ దేశాల సమావేశంలో ప్రపంచంలో అతి పెద్ద చమురు ఉత్పత్తి దేశం సౌదీ అరేబియా దిగజారుతున్న క్రూడ్‌ ధరల్లో స్థిరత్వం తీసుకువచ్చేందుకు డిసెంబర్‌లో రోజువారీ ఉత్పత్తిని 5 లక్షల బ్యారెళ్లు తగ్గించనున్నట్టు ప్రకటించడం అంతర్జాతీయ విపణిపై తీవ్ర ప్రభావం చూపింది.

సెన్సెక్స్‌ 35287.49 పాయింట్ల వద్ద బలంగానే ప్రారంభమై 35333.22 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినా లాభాల స్వీకారంతో నష్టాల్లోకి జారుకుంది. చివరికి 345.56 పాయింట్ల నష్టంతో 34812.99 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 10645-10464 పాయింట్ల మధ్యన కదలాడి చివరికి 103 పాయింట్ల నష్టంతో 10482.20 వద్ద ముగిసింది.
 
దీనికి తోడు అక్టోబర్ నెలలో టాటా మోటార్స్‌ యాజమాన్యంలోని జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ అమ్మకాలు 5 శాతం క్షీణించాయన్న వార్తల నడుమ ఆ షేరు సెన్సెక్స్‌ షేర్లలో నష్టాల్లో అగ్రగామిగా నిలిచింది.

బీఎస్‌ఈలో ఆ షేరు 4.6 శాతం దిగజారి రూ.185.95 వద్ద ముగియగా ఎన్‌ఎస్‌ఈలో 4.58 శాతం దిగజారి రూ.186.30 వద్ద ముగిసింది. ప్రత్యేకించి ఆటో రంగ సూచీ గరిష్ఠంగా 2.31 శాతం నష్టపోయింది. హీరోమోటోకార్ప్‌ (3.82 శాతం), పవర్‌గ్రిడ్‌ (2.87 శాతం), మారుతి సుజుకీ (2.64 శాతం), అదానీ పోర్ట్స్‌ (2.61 శాతం) నష్టపోయాయి. 

మార్కెట్‌ పతనం సెగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, విమానయాన కంపెనీలపై కూడా పడింది. యెస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ కూడా నష్టపోయిన షేర్లలో ఉన్నాయి.

హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు 7 శాతం వరకు నష్టపోగా విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ 5.43 శాతంతో నష్టాల్లో అగ్రగామిగా నిలిచింది. ట్రెండ్‌కు భిన్నంగా టాటా స్టీల్‌, కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ లాభపడ్డాయి.

ఎన్‌ఎస్‌ఈలో టైటాన్‌, టెక్‌మహింద్రా, టాటాస్టీల్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటామోటార్స్‌, హీరోమోటార్స్‌, హిందాల్కో షేర్లు భారీగా నష్టపోయాయి.

మరోవైపు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరోసారి తీవ్ర ఒత్తిడికి గురైంది. అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి 39 పైసలు నష్టపోయి 72.89 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూపాయి 57 పైసలు నష్టపోయి 73.07కి దిగజారినా తిరిగి కోలుకుని చివరికి 39 పైసల నష్టంతో ముగిసింది.

click me!
Last Updated Nov 13, 2018, 7:35 AM IST
click me!