
State Bank of India : డిజిటల్ బ్యాంకింగ్ విస్తృతమవుతున్న తరుణంలో, సైబర్ మోసాల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారుల భద్రతను పెంపొందించేందుకు కీలక ముందడుగు వేసింది. తమ ఖాతాదారుల కోసం చేసే కాల్స్ కోసం ప్రత్యేక సిరీస్ ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎస్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. +91-1600 సిరీస్‌తో ప్రారంభమయ్యే ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌నే నమ్మదగినవిగా పరిగణించవచ్చని పేర్కొంది. ఈ నంబర్లు పూర్తిగా లావాదేవీలు, సేవల కోసం మాత్రమే ఉపయోగిస్తామని ఎస్బీఐ తెలిపింది.
ఈ సందర్భంగా ఎస్‌బీఐ తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో.. "మీకు +91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి కాల్ వస్తే, అది నకిలీ కాల్ కాదని ధైర్యంగా సమాధానం ఇవ్వవచ్చు. ఇది ఖచ్చితంగా లావాదేవీలు లేదా సేవలకే సంబంధించిన కాల్. ఇవి కాకుండా వేరే నంబర్లతో వస్తే స్వీకరించకండి" అని పేర్కొంది.
2025 జనవరి 17న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అన్ని బ్యాంకులు, నియంత్రిత సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో పేర్కొన్న విధంగా, లావాదేవీలు, సేవల కోసం మాత్రమే "1600xx" సిరీస్ నంబర్లను ఉపయోగించాలి. ప్రచార కాల్స్ కోసం మాత్రం "140xx" సిరీస్‌ను మాత్రమే అనుమతించారు.
"డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ మోసాలూ అధికమవుతున్నాయి. మొబైల్ నంబర్ ఒక ప్రధాన గుర్తింపుగా మారి, OTPలు, లావాదేవీ అలెర్ట్స్, ఖాతా అప్‌డేట్స్ వంటి కీలక సమాచారాన్ని అందుకుంటోంది. ఇదే స్కామర్లు మోసం చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారని" తెలిపింది.
• 1600-01-8000
• 1600-01-8003
• 1600-01-8006
• 1600-11-7012
• 1600-11-7015
• 1600-01-8001
• 1600-01-8004
• 1600-01-8007
• 1600-11-7013
• 1600-00-1351
• 1600-01-8002
• 1600-01-8005
• 1600-11-7011
• 1600-01-7014
• 1600-10-0021
బ్యాంకు వినియోగదారులకు మరోసారి గుర్తుచేస్తూ.. ఈ అధికారిక నంబర్లను తప్ప మరే ఇతర అపరిచిత నంబర్లను నమ్మవద్దు. అనుమానాస్పద కాల్స్‌కి స్పందించవద్దని పేర్కొంది. ఎస్బీఐ తీసుకున్న ఈ చర్యలు డిజిటల్ మోసాల నివారణకు దోహదం చేయడం లక్ష్యంగా ఉన్నాయి. వినియోగదారుల భద్రతను మెరుగుపర్చడానికి ఎస్‌బీఐ, ఆర్బీఐ తీసుకుంటున్న జాగ్రత్తలతోపాటు ప్రజలకు అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.