స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరు.. ఒక్కరోజే 10% పెరిగిన లాభం...

By Sandra Ashok KumarFirst Published Apr 23, 2020, 10:53 AM IST
Highlights


జియోలో ఫేస్ బుక్ పెట్టుబడి పెట్టనుండటంతో బుధవారం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పది శాతం పెరిగింది. మరోవైపు పెట్రో కెమికల్ మేజర్ సౌదీ ఆరామ్ కో సంస్థతో రిలయన్స్ ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. 

ముంబై: ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జియో కుదుర్చుకున్న వాటా ఒప్పందంతో స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ బుధవారం అమాంతం దూసుకెళ్లింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ (బీఎస్ఈ) ఇంట్రాడేలో 12 శాతానికి పైగా లాభపడిన కంపెనీ షేరు ధర మార్కెట్‌ ముగిసే సమయానికి 10.30 శాతం లాభంతో రూ.1,365.35 వద్ద స్థిరపడింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ షేర్ 9.83 శాతం ఎగబాకి రూ.1,359 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.80,710 కోట్లు పెరిగి రూ.8,64,267.70 కోట్లకు చేరుకున్నది.  

జియోపై రిలయన్స్ ఇలా పెట్టుబడి
2016 నుంచి ఇప్పటి వరకు జియో కోసం రిలయన్స్ ఏకంగా 50 బిలియన్‌ డాలర్ల మేరకు ఖర్చు చేసింది. కాగా, గతేడాది డిసెంబర్‌ నాటికి రిలయన్స్ సంస్థకు మొత్తంగా రూ.3,06,851 కోట్ల మేర రుణాలు ఉన్నాయి. ఇదే సమయంలో సంస్థ చేతిలో రూ.1,53,719 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటంతో సంస్థ అప్పు రూ.1,53,132 కోట్లకు తగ్గనున్నది.

జియో, వాట్సాప్, ఫేస్ బుక్ ఖాతాదారులు 103 కోట్ల మంది
భారత్‌లో వాట్సప్‌నకు 40 కోట్లు, జియోకు 38 కోట్లు, ఫేస్‌బుక్‌నకు 25 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపరుచుకునే ఉద్దేశంలో భాగంగా రిలయన్స్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నది. 

ఫేస్ బుక్ కు జియోతో బంధం ఎంతో కీలకం
చైనా తర్వాత భారత్‌లో అత్యధిక మంది వినియోగదారులున్న ఫేస్‌బుక్‌కు జియోతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకంగా మారింది. సోషల్ మీడియా దిగ్గజం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి ఇక్కడ పేమెంట్‌ రంగంలోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నది. 2014 తర్వాత ఫేస్‌బుక్‌ కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదే. గతంలో వాట్సప్‌లోనూ వాటాను కొనుగోలు చేసింది. 

also read అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాక్... వాట్సాప్ ద్వారా నిత్యవసరాల డెలివరీ...

జియోతో ఫేస్ బుక్ బంధం దేశానికి మేలు: ఆనంద్ మహీంద్రా
రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతకు బలమైన సంకేతంగా అభివర్ణించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌, జియోలో వాటా కొనుగోలుపై ఆయన ముకేశ్‌ అంబానీకి అభినందనలు తెలిపారు.

ముకేశ్ అంబానీకి ప్రశంసలు తెలిపిన మహీంద్రా
‘‘ఫేస్‌బుక్‌తో జియో ఒప్పందం ఆ రెండు సంస్థలకు మాత్రమే లాభదాయకం కాదు. సంక్షోభంలో ఈ ఒప్పందం కుదిరినప్పటికి, కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతకు ఇది బలమైన సంకేతం. ప్రపంచం మొత్తానికి భారత్‌ అభివృద్ధి కేంద్రంగా మారుతుందనే వాదనను ఇది బలపరుస్తుంది. ముకేశ్‌ గొప్పగా చేశావ్ ’’ అని మహీంద్రా ట్విటర్లో పేర్కొన్నారు.

ఆరామ్ కోతో రిలయన్స్ బంధంపై నీలి నీడలు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు కీలక సమయంలో జియోతో ఫేస్ బుక్ ఒప్పందం కుదరింది. ఇప్పటివరకు పెట్రో కెమికల్ రంగంలో దిగ్గజంగా ఉన్న సౌదీ ఆరామ్ కో పెట్టుబడుల కోసం రిలయన్స్ కీలకంగా పని చేసింది. కానీ గత రెండు నెలలుగా కరోనా వైరస్ ప్రభావంతో ముడి చమురు ధరలు పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరామ్ కో సంస్థతో రిలయన్స్ భాగస్వామ్య ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి.  
 

click me!