జియో అండగా అగ్రశ్రేణి సంస్థగా రిలయన్స్: ముకేశ్ చేతికి తమ్ముడి ఆస్తులు

By pratap reddyFirst Published 24, Aug 2018, 7:00 AM IST
Highlights

ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్)లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను గురువారం అధిగమించి 111 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. 2006 తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ మొదటి స్థానానికి చేరుకోవడానికి కారణం జియో ఇన్ఫోకాం.

ముంబై: ‘జియో ఫోన్’ అండగా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) దేశంలో అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఆర్‌ఐఎల్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) పోటాపోటీగా ఉంటాయి. కాగా ఆర్‌ఐఎల్‌ గురువారం రూ.8లక్షల కోట్ల (114 బిలియన్ల అమెరికన్ డాలర్లు)తో తొలి స్థానంలో నిలిచింది. భారత కంపెనీల్లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8లక్షల కోట్లను చేరిన ఏకైక కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఘనత సాధించింది. 

111 బిలియన్ల డాలర్లకు చేరిన రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్


గురువారం ట్రేడింగ్‌లో ఆర్‌ఐఎల్‌ షేర్లు 1.47శాతం లాభంతో రూ.1265 వద్ద ట్రేడయ్యాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,00,001.54 కోట్లకు చేరింది. ‘టీసీఎస్‌’ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,77,879 కోట్ల వద్ద ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో ఏడాది కాలంలో 37.3 శాతం పురోగతి సాధించింది. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 21వ తేదీన 100 బిలియన్ల డాలర్లకు చేరింది. 

2016 సెప్టెంబర్‌లో జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సంచలనం


2016 సెప్టెంబర్‌లో టెలికం రంగంలో రిలయన్స్ జియో ఇన్ఫోకాంను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతోనే భారత్ టెలికం రంగం తీవ్ర ఒడిదొడుకులకు గురైంది. నాటి నుంచి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెట్టింపైంది. దీనికి తోడు అమెరికా డాలర్‌పై రూపాయి విలువ 10 శాతం పతనం కావడంతో రిలయన్స్ విలువ 100 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇక ముకేశ్ అంబానీ ఆస్తి 48 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. ఇది రిలయన్స్ సంస్థ షేర్లలో 47 శాతం. 

రూ.2.5 లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ జియో పెట్టుబడులు


రిలయన్స్ జియోను ప్రారంభించడంతో పెట్టుబడులు రూ.2.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇంటర్ కనెక్ట్ ఫీజు తగ్గించాలని టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించడంతో రిలయన్స్ జియో మరింత లబ్ధి పొందింది. చౌక ధరలకు డేటా ప్లాన్లు అమలు చేస్తూ మార్కెట్‌లో అడుగు పెట్టిన రిలయన్స్ జియో అనతి (18 నెలల్లోనే) కాలంలోనే 21 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను చేర్చుకోగలిగింది. 

రిఫైనరీ రంగంలో రిలయన్స్ సంస్థకు ఇలా లాభాలు


రిలయన్స్ తన పెట్రో కెమికల్స్ రిఫైనింగ్‌లో ఈథేన్, గ్యాస్ లను ముడి సరుకుగా వాడుతోంది. లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ కంటే వీటి ధరలు చౌకగా ఉండటంతోపాటు అనిశ్చితి తక్కువ. ఎల్ఎన్జీ ధరలు ఆయిల్‌తోపాటు పెరగడంతో 50కి పైగా శాతం పెరిగింది. చౌక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటంతో రిలయన్స్ నిర్వహణ లాభాలకు ప్రోత్సాహంగా ఉంది. ప్రత్యేకించి రిఫైనరీ రంగంలో లబ్ధి చేకూరింది. 

2007 తర్వాత మార్కెట్ కేపిటలైజేషన్ కైవసం చేసుకున్న రిలయన్స్


2007 తర్వాత ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. అప్పటి వరకు ఆ స్థానంలో టీసీఎస్‌ ఉండగా దాన్ని వెనక్కి నెట్టేసింది. తాజాగా రూ.8లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు కూడా చేరింది. గత నెల జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సమావేశంలో ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ 2025నాటికి రిలయన్స్ వ్యాపారం రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 63 శాతం పెరిగాయి. గురువారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి.  

జియోకు రూ.2000కోట్ల ఆస్తులు అమ్మిన ఆర్‌కామ్‌


రిలయన్స్‌ జియోకు ప్రణాళిక ప్రకారం మీడియా కన్వెర్జెన్స్‌ నోడ్స్‌(ఎంసీఎన్‌)ను అమ్మేసినట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ సంస్థ 248 నోడ్‌‌లతో పాటు ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ఆస్తులు కలిపి దాదాపు మొత్తం రూ.2000కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు అమ్మే ప్రక్రియ పూర్తైందని తెలిపింది. 5మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతాన్ని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగించనున్నారు. అన్నీ జియోకు బదిలీ చేసినట్లు ఆర్‌కామ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

మరో రూ.25 వేల కోట్ల ఆస్తులు అమ్మనున్న ఆర్ కామ్


ఇంకా రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులను ఆర్‌కామ్‌ అమ్మనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌.. రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. అప్పులు తగ్గించుకునేందుకు ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌, టవర్‌, ఫైబర్‌ అండ్‌ ఎంసీఎన్‌ ఆస్తులను జియోకు అమ్మేసేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్‌ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్‌ 4జీ స్పెక్ట్రమ్‌, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 248 మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌ అమ్మకం డీల్ గురువారం పూర్తయింది. 

Last Updated 9, Sep 2018, 1:09 PM IST