రిలయన్స్ జోరు: సరికొత్త దారంతో పర్యావరణ అనుకూల దుస్తులు

By Siva KodatiFirst Published Sep 13, 2019, 1:29 PM IST
Highlights

ఇప్పటికే ఆయిల్, సహజ వాయువు, కమ్యూనికేషన్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత ‘‘సస్టైనబుల్ ఫ్యాషన్’’కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇప్పటికే ఆయిల్, సహజ వాయువు, కమ్యూనికేషన్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుత ‘‘సస్టైనబుల్ ఫ్యాషన్’’కు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ రంగంలో దూసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సామాజిక మాధ్యమాలు, ఇతర అవగాహానా కార్యక్రమాల ప్రభావం నేపథ్యంలో ఇటీవల యువతపై పర్యావరణంపై స్పృహా పెరిగింది. ప్రకృతికి ఎలాంటి హాని కలగని రీతిలో అతి తక్కువ కార్బన పదార్ధాలతో ఉండే దుస్తులను యువతరం కోరుకుంటోంది.

తాము ఈ సస్టైనబుల్ ఫ్యాషన్‌ను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని.. ఇది కూడా ఒక రకమైన కార్పోరేట్ సామాజిక బాధ్యత కిందకే వస్తుందన్నారు రిలయన్స్ పెట్రో కెమికల్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విపుల్ షా.

తమ కంపెనీ వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేయడంలో దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోందని.. ప్రతి సంవత్సరం దాదాపు రెండు బిలియన్ల బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తున్నామని షా తెలిపారు. దీనిని రాబోయే రెండేళ్లలో ఆరు బిలియన్లకు పెంచాలన్నదే తమ లక్ష్యమని విపుల్ స్పష్టం చేశారు.

వుపయోగించిన పీఈటీ బాటిళ్లను రీసైక్లింగ్ చేసే ఏకైక కంపెనీ రిలయన్స్ మాత్రమేనని.. ఈ విధానంలో తాము అనుసరించే విధానం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.

పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేసిన తర్వాత దానికి బయో ఇంధనాలు కలిపి ప్రాసెస్ చేసి గ్రీన్ గోల్డ్‌ ఫ్రాబ్రిక్‌ను తయారు చేస్తున్నామని షా పేర్కొన్నారు. గ్రీన్ గోల్డ్ అనేది అత్యున్నతమైన పర్యావరణహిత లక్ష్యానికి ముందడుగుగా ఆయన అభివర్ణించారు.

ఇది పర్యావరణహితంతో పాటు మరోవైపు కస్టమర్ల మన్నన పొందుతోందన్నారు. సాధారణంగా వాటర్ బాటిల్స్‌ను ఖాళీ చేసిన తర్వాత వాటినే పారేస్తాం. కానీ వీటి వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. త్వరగా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ డబ్బాలు నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థకు అడ్డుపడతాయి.

ఒక బాధ్యతగల కార్పోరేట్ సంస్థగా వీటి దుష్పరిణామాలను గుర్తించిన రిలయన్స్ 2000వ సంవత్సరం ఆరంభంలోనే పెట్ వాటర్ బాటిల్స్‌ను రీసైక్లింగ్, పునర్వినియోగం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తోంది.  

ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యాబ్రిక్‌ను ఉత్పత్తి చేస్తోంది. అలాగే టెక్స్‌టైల్స్ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన అనేక సంస్థలతో రిలయన్స్ కలిసి పనిచేస్తోంది.

ఈ కోవలో ఇప్పటికే రేమండ్ నుంచి ఎకోవీరా వస్త్రాలు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్రో కెమికల్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.

దీంతో నష్టాలను ఎదుర్కోవడానికి ఆయా రంగాలు సరికొత్త అన్వేషణలను మొదలుపెట్టాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా రీసైక్లింగ్ చేయబడిన పాలిమర్ దుస్తులకు మంచి గిరాకీ ఉండే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఇటలీకి చెందిన ప్రఖ్యాత దుస్తుల సంస్థ ప్రాదా రీసైక్లింగ్ మెటిరీయల్‌తో నైలాన్ బ్యాగ్స్ తయారు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారింభించగా.. బ్రిటీష్ దిగ్గజం బర్‌బెర్రీ సైతం గ్రీన్ యార్న్ అంటూ ఎక్‌ఫ్రెండ్లీ వైపు అడుగులు వేసింది. 

click me!