బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ బరిలో రాజన్!

By rajesh yFirst Published Jun 13, 2019, 12:07 PM IST
Highlights

325 సంవత్సరాల చరిత్ర గల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవి కోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పోటీ పడుతున్నారు. ‘బ్రెగ్జిట్’పై బ్రిటన్ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ఈ గవర్నర్ పదవి కోసం పోటీ పడుతుండటం గమనార్హం. 

లండన్‌: రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ యునెటెడ్ కింగ్ డమ్‌ (యూకే)లో కీలక పదవికి పోటీ పడుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్న టాప్‌ వ్యక్తుల్లో ఒకరిగా ఆయన ఉన్నారని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. 2013 నుంచి 2016 మధ్య ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పనిచేసిన సంగతి తెలిసిందే. 

ఆర్బీఐ గవర్నర్‌గా వైదొలిగిన తర్వాత రఘురామ్ రాజన్ చికాగో యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లో చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

 బ్రెగ్జిట్‌ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌గా ఉన్న మార్క్‌ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని నియమించనున్నారు. అక్టోబర్‌ 31లోపు ఈ నియామకం జరగనుంది. 2020 జనవరిలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కొత్త గవర్నర్‌ నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి పోటీ చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల్లో రాజన్‌ ఒక్కరే విదేశీయులని అని పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 

అయితే రాజన్ అభ్యర్థిత్వంపై ఆయన కానీ, బ్యాంకు కానీ స్పందించడం లేదు. ముఖ్యంగా బ్రెగ్జి్‌ట్‌ ఓటింగ్‌ సమయంలో అయోమయంలో ఉన్న బ్రిటన్‌కు మద్దతుగా రాజన్‌ వ్యాఖ్యలు చేశారు. 2005లో ఐఎంఎఫ్‌లో ఉన్నప్పుడు ఆర్థిక మాంద్యం ముప్పును రఘురామ్ రాజన్ ముందే ఊహించారు. 

2008లో ఆర్థిక మాంద్యం తలెత్తకముందు తొలుత తన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ రఘురామ్ రాజన్ మాటలు నిజమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. 2008లో సంభవించిన ఆర్థికమాంద్యం వల్ల లీమన్‌ బ్రదర్స్‌ వంటి కంపెనీలే కుప్పకూలడం గమనార్హం.

బ్రిటన్ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో రఘురామ్ రాజన్ ఈ పదవికి పోటీ పడుతుండటం గమనార్హం. బ్రిటన్ ద్రవ్య విధానాన్ని పర్యవేక్షిస్తూ, ఆర్థిక స్థిరత్వాన్ని నిభాయించడం రాజకీయ చాతుర్యంతో కూడుకున్నది.
 
325 సంవత్సరాల చరిత్రగల బ్యాంకు ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’. ఈ బ్యాంకు గవర్నర్ పదవికి దరఖాస్తుల స్వీకరణ గడువు గత వారంతో ముగిసింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగుతుండటంతో ఆ దేశ ప్రధాన మంత్రి థెరీసా మే సహా అనేక మంది రాజకీయ నాయకులు రాజీనామా చేశారు.

ఆర్బీఐ గవర్నర్‌గానూ రఘురామ్ రాజన్ ద్రవ్యోల్బణ సమస్యను నియంత్రణలోకి తేవడంలో, బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల వసూళ్ల ప్రక్రియ చేపట్టేందుకు ఆయన అనుసరించిన వ్యూహం విజయాలు సాధించి పెట్టింది. రాజన్‌తోపాటు యూకేలోని సాంతండర్ చైర్ పర్సన్ శిరిస్థి వాదేరా పోటీ పడుతున్న ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్నారు. ఆమెకు గార్డన్ బ్రౌన్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

click me!