సెంచరీకి చేరువలో పెట్రో ధరలు: హైదరాబాద్ లో ధర ఇదీ...

By pratap reddyFirst Published Sep 10, 2018, 7:23 AM IST
Highlights

పెట్రోల్ ధరలు దేశ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ.85 దాటింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలోనే ‘సెంచరీ’ కొట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: ప్రజలు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే గుండెదడ వచ్చేలా ఇంధన ధరలు బెంబేలెత్తుతున్నారు. రూ.90కి చేరువైన లీటర్ పెట్రోల్ ధర త్వరలోనే సెంచరీ కొట్టేలా కనిపిస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా ఆదివారం రూ.80.50ని తాకింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయిలో రూ.72.61కి చేరుకుంది. డాలర్‌తో పోల్చితే రూపాయి పతనం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణం అవుతున్నది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.

పెట్రో ధరల సరికొత్త రికార్డులు ఇలా


పెట్రో, డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయిలను దాటుకుంటూ దూసుకుపోతున్నాయి. ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటాయి. సరిగ్గా రెండేండ్ల క్రితం 2016 సెప్టెంబర్‌లో లీటర్ రూ.64గా ఉన్న పెట్రోలు ధర ప్రస్తుతం రూ.85ను దాటింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర తొలిసారి ఆదివారం రూ.80.50ని తాకింది. డీజిల్ ధర కూడా రికార్డు స్థాయిలో రూ.72.61ని చేరుకుంది. మెట్రో నగరాలు, వివిధ రాష్ర్టాల రాజధాని నగరాల్లో ఇదే అతితక్కువ ధర. దేశంలో అత్యధికంగా ముంబైలో పెట్రోలు ధర రూ.87.89కి చేరుకోగా, డీజిల్ ధర రూ.77.09కి చేరింది. ఇదే స్థితి కొనసాగితే, రెండురోజుల్లో ఈ ధర రూ.90కి చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భాగ్యనగరిలో రూ.85 దాటిన పెట్రోల్


హైదరాబాద్‌లో ధర ఆదివారం 12పైసలు పెరిగి రూ.85.35కు ఎగబాకింది. డీజిల్ ధర 11పైసలు పెరిగి రూ.78.98కి చేరింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.72.1 వద్ద కదలాడుతున్న నేపథ్యంలో ముడి చమురు దిగుమతుల నష్టాల భర్తీ కోసం చమురు సంస్థలు వరుస వడ్డింపులకు దిగుతున్నాయి. నెలరోజులుగా ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి క్షీణత ఫలితంగా దేశీయంగా ఇంధన ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదవుతున్నది. అది అంతిమంగా ద్రవ్యోల్బణంగా మారే ప్రమాదమున్నందున, నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల వేళ రోజులు, నెలల తరబడి ధరల జోలికి చమురు మార్కెటింగ్ సంస్థలు వెళ్లకుండా కట్టడి చేయగలిగిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి.

211శాతం పెరిగిన ఎక్సైజ్ సుంకం


2014 నుంచి ఇప్పటివరకు ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై 211.7%, డీజిల్‌పై 433% పెరిగింది. 2014లో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.9.2గా ఉండగా, ప్రస్తు తం 19.48కి పెరిగింది. డీజిల్‌పై 2014లో రూ.3.46 గా ఉన్న సుంకం ప్రస్తుతం రూ.15.33కి చేరింది. అంతర్జాతీయ ధరల సాకుతో 2014-2016 మధ్య 9 సార్లు సవరించిన ఎక్సైజ్ సుంకంతో కేంద్రానికి ఆదాయం గత నాలుగేండ్లలో గణనీయంగా పెరిగిపోయింది. 2014-15లో కేంద్రం రూ. 99,184 కోట్లు.. 2017-18కల్లా రూ.2,29,019 కోట్లు ఆర్జించింది. రాష్ర్టాల వ్యాట్ ఆదాయం 2014-15లో రూ.1,37,157 కోట్లు.. 2017-18కల్లా రూ.1,84,091 కోట్లకు చేరుకుంది.

click me!