
భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వాణిజ్య బంధం సరికొత్త పుంతలు తొక్కింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం ఆసియా మార్కెట్లో సుస్థిర అభివృద్ధికి సూచికగా నిలుస్తోంది. తాజాగా భారత రాయబార కార్యాలయం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), దుబాయ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కలిసి “కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్” (CEPA) విజయవంతమైన సంవత్సరాన్ని పురస్కరించుకుని దుబాయ్ నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి భారత్, UAEలకు చెందిన 200 కంటే ఎక్కువ ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా UAE విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి డా. థానీ అల్ జెయోడీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, CEPA అందించిన అవకాశాలు, వాటి వల్ల ఇరు దేశాలు పొందిన ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రసంగిస్తూ, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కొనసాగుతున్న అనేక వ్యాపారాలు CEPA స్కీం కింద పలు పన్ను మినహాయింపులు, మెరుగైన మార్కెట్ యాక్సెస్ సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
CEPA ఏర్పాటు అనంతరం బంగారం, ఆభరణాల పరిశ్రమ కొత్త పుంతలు తొక్కిందని దుబాయ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ గ్రూప్ వైస్ చైర్మన్ చందు సిరోయా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ సీఈవో సైఫీ రూపావాలా, ఫిక్కీ మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా నిరంకర్ సక్సేనా, ఫిక్కీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ ఏప్రిల్ 2023 నుండి 2030 వరకు దుబాయ్‌లో భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలను, పెట్టుబడి, పరిశ్రమల స్థాపన ప్రోత్సహించేలా FICCI ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
భారతదేశం-యుఎఇ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం “కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్” (సిఇపిఎ) 18 ఫిబ్రవరి 2022న వర్చువల్ సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, UAE హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమక్షంలో సంతకాలు చేశారు.
ఈ చారిత్రాత్మక భారత-యుఎఇ అగ్రిమెంట్ అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్యం,పెట్టుబడులు,హెల్త్ కేర్, డిజిటల్ కామర్స్ మొదలైన రంగాల్లో UAEతో భారత్ సహాయ సహకారాలను పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. CEPA ద్వైపాక్షిక వాణిజ్యంలో కొత్త అవకాశాలను ఆవిష్కరించింది. ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు సంవత్సరాలలో 100 బిలియన్ డాలర్లు చేరడమే లక్ష్యంగా ఈ ఒఫ్పందం కుదిరింది. అలాగే ఈ ఒప్పందం అనంతరం సర్వీసెస్ రంగంలో ఇరు దేశాల వాణిజ్యం 15 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
CEPA 1 మే 2022 నుండి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇరు దేశాలకు చెందిన వ్యాపారాలు అన్ని రకాల సౌకర్యాలను వినియోగించుకుంటున్నాయి. CEPA ఒప్పందం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ 2022 నుండి మొదటి ఎనిమిది నెలల్లో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 45.3 బిలియన్ డాలర్ల నుంచి 57.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే దాదాపు 27.5% వృద్ధిని నమోదు చేసింది. 12.5 బిలియన డాలర్ల పెరుగుదలను గమనించవచ్చు.
అదే సమయంలో, UAEకి భారత్ నుంచి ఎగుమతుల్లో 19.32% వృద్ధి కనిపించింది. 17.45 బిలియన్ డాలర్ల నుండి 20.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది మొత్తంగా చూస్తే 3.35 బిలియన్ డాలర్ల పెరుగుదలగా చూడవచ్చు. ఇందులో ప్రధానంగా ఇంధనం, ఆహార ఉత్పత్తులు, విద్య, వైద్యానికి సంబంధించి అనేక ఇతర రంగాల్లో సైతం వృద్ధిని గమనించవచ్చు.