నో మొబైల్స్.. నో ఫోటో షేరింగ్.. ఆశా పెండ్లికి హిల్లరీ

By narsimha lodeFirst Published Dec 9, 2018, 10:48 AM IST
Highlights

 అంబానీ వారింట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌ అంబానీ గారాల పట్టి ఈశా అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి

ఉదయ్‌పూర్‌: అంబానీ వారింట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌ అంబానీ గారాల పట్టి ఈశా అంబానీ పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈనెల 12న ఆనంద్‌ పిరమాల్‌తో ఈశా వివాహం జరగనున్నది. రాజస్థాన్‌లోని ఒకనాటి సంస్థాన కేంద్రమైన ఉదయ్‌పూర్‌లోని ఒబెరాయ్‌ ఉదయ్‌ విలాస్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆది, సోమవారాల్లో మెహెందీ, సంగీత్‌ వేడుకలు జరగనున్నాయి. వివాహ ఆహ్వాన పత్రిక నుంచి అన్న సేవా కార్యక్రమం వరకు ప్రతి వేడుక ఘనంగా నిర్వహించేలా అంబానీ ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

బాలీవుడ్‌ నటీమణులు దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వివాహాల్లో మాదిరిగా ఈశా పెళ్లికి కూడా ఆంక్షలు విధించారు. పెళ్లికి వచ్చే అతిథులెవరూ ఫోన్లు తేకూడదు. ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంపైనా నిషేధం విధించినట్లు సమాచారం. తమ ప్రైవసీని కాపాడటానికి ఎవరూ ఫోన్లు తీసుకురావద్దని ముకేశ్‌ దంపతులు స్వయంగా అతిథులను కోరారట. వివాహ వేడుక పూర్తయిన రోజే స్వయంగా అంబానీ కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులు ఈ ఫొటోలను, వీడియోలను షేర్‌ చేస్తారట. ప్రియాంక వివాహానికి ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జోసెఫ్‌ రాధిక్ ఈశా వివాహానికి కూడా పనిచేయనున్నారు.

దిగ్గజ వ్యాపార వేత్త ముఖేశ్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహం.. ఆనంద్ పిరమాల్‌తో ఈ నెల 12న ఉదయ్‌పూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా నుంచి డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. ఈమెతో పాటు బాలీవుడ్‌కు చెందిన దిగ్గజ నటీనటులు, క్రీడా ప్రముఖులు చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌ సంస్థానంలో ఆదివారం నుంచి ముందస్తు పెళ్లి వేడుకలు జరగనున్నాయి.

బాలీవుడ్‌ తారలు విద్యాబాలన్‌-సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ దంపతులు, జాన్‌ అబ్రహం-ప్రియా రుంచాల్‌, ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్ దంపతులు‌, జావెద్‌ జాఫ్రే హాజరయ్యారు. క్రీడా రంగం నుంచి సచిన్‌ తెండూల్కర్‌-అంజలి తెండూల్కర్‌, ధోని భార్య సాక్షి సింగ్‌ కుమార్తె జీవాతో కలిసి వేడుక వద్దకు చేరుకున్నారు. మిగతా బాలీవుడ్, క్రీడా ప్రముఖులు వీరికి జత కలువనున్నారు.

శుక్రవారం అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు ‘అన్నదాన సేవ’ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల పాటు మూడు పూటలా మొత్తం 5,100 మందికి అన్నదానం చేయనున్నారు. వీళ్లలో ఎక్కువ మంది దివ్యాంగులే ఉన్నారు. 10వ తేదీ వరకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఓ వైపు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూనే ఈ వేడుకలను అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు కన్నుల పండువగా నిర్వహించనున్నాయి.
 

click me!