
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నిందితుడైన నీరవ్ మోడీకి చెందిన రూ.637 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారంనాడు తెలిపింది. భారతదేశంలోనే కాకుండా నాలుగు ఇతర దేశాల్లోని ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది.
భారతదేశం, యుకె, న్యూయార్క్, ఇతర దేశాల్లోని ఆభరణాలు, ఫ్లాట్స్, బ్యాంక్ బ్యాలెన్స్ లను స్వాధీనం చేసుకున్నామని ఈడి అధికారులు చెప్పారు. న్యూయార్క్ లో ఉన్న రూ.216 కోట్ల విలువ చేసే రెండు స్థిరాస్తులను కూడా ఆటాచ్ చేసినట్లు తెలిపారు.
ఆటాచ్ చేసిన వాటిలో నీరవ్ మోడీకి చెందిన ఐదు బ్యాంకుల్లోని రూ.278 కోట్ల బ్యాలెన్స్ కూడా ఉంది. రూ.22.69 కోట్ల విలువ చేసే వజ్రాలతో పొదిగిన అభరణాలను హాంగ్ కాంగ్ నుంచి భారత్ కు తెప్పించారు. రూ.19.5 కోట్ల విలువ చేసే దక్షిణ ముంబైలోని ఫ్లాట్ ను అటాచ్ చేశారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఐదు విడివిడి ఉత్తర్వులు జారీ నీరవ్ మోడీ ఆస్తులను అటాచ్ చేశారు. ఆదిత్య నానావతిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తున్నట్లు ఈడి అధికారి ఒకరు చెప్పారు.