ప్రియురాలి తమ్ముడి వల్లే అమెజాన్ అధినేత కాపురంలో నిప్పులు

By Arun Kumar PFirst Published Mar 20, 2019, 1:37 PM IST
Highlights

అమెరికాలో అక్కా తమ్ముడు అంటే ఓకే కావచ్చేమో కానీ అదీ కూడా డబ్బు సంబంధాలకు దారి తీస్తున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అపర కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అత్యంత రహస్య వ్యక్తిగత సమాచారం లీకేజీకి ఆయన గర్ల్ ఫ్రెండ్ సాంచెజ్ సోదరుడు మిషెల్ కారణమని తేలింది. 2 లక్షల డాలర్లకు అమ్మేశాడని, ట్రంప్ ఇన్నర్ సర్కిల్ సభ్యుడిగా రాజకీయ దురుద్దేశంతో చేశాడని తెలుస్తున్నది. మిషెల్ చేసిన లీకేజీ జెఫ్ బెజోస్ కాపురంలో నిప్పులు పోసింది. మెకన్జీ తన భర్త జెఫ్ నుంచి విడాకులు తీసుకున్నది.

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌ అత్యంత వ్యక్తిగత సమాచారం లీక్ కావడానికి ఆయన గర్ల్ ఫ్రెండ్ లారిన్ సాంచెజ్ సోదరుడే కారణమని తేలింది. అంతే కాదు జెఫ్ బెజోస్, మెకెన్జీ దాంపత్యం విడాకులకు దారి తీయడానికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. 
జెఫ్ బెజోస్‌కు చెందిన అత్యంత రహస్య వివరాలను‘నేషనల్‌ ఎంక్వైరర్‌’అనే పత్రిక ప్రచురించింది. వీటిని బెజోస్‌ స్నేహితురాలు లారిన్ షాంచెజ్ తమ్ముడే రెండు లక్షల డాలర్లకు నేషనల్ ఎంక్వైరర్ పత్రికకు విక్రయించినట్లు తేలింది. గత జనవరిలో ఎంక్వైరర్‌ పత్రిక బెజోస్‌ టెక్స్ట్ సందేశాలను ప్రచురించింది. 

మాజీ యాంకర్‌ లారిన్‌ సాంచెజ్‌తో బెజోస్‌కు వివాహేతర సంబంధం ఉందని నేషనల్ ఎంక్వైరర్ పేర్కొంది. ఈ విషయం బయటకు రాగానే జెఫ్‌ భార్య మెకన్జీ విడాకులు ఇచ్చేశారు. 

ఫిబ్రవరిలో తన కాపురంలో ఎంక్వైరర్‌ పత్రిక నిప్పులు పోసిందని, డబ్బుకోసం బ్లాక్‌ మెయిల్‌ చేసిందని జెఫ్ బెజోస్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ ఇంకో వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది.

బెజోస్‌కు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక తరచూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆప్తమిత్రుడైన ఎంక్వైరర్‌ యజమాని డేవిడ్‌ పెస్కర్‌ రంగంలోకి దిగి ఈ టెక్స్ట్‌ మెసేజ్‌లను సంపాదించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

జెఫ్‌ భార్యకు విడాకులు ఇచ్చాక అధ్యక్షుడు ట్రంప్‌ ఆయన్ను కసిదీరా ‘జెఫ్‌ బోజోస్‌’అని హేళన చేశారు. జెఫ్ బెజోస్, లారిన్ మధ్య జరిగిన సంభాషణ లీకేజీపై తాజాగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మరో సంచలన కథనం ప్రచురించింది. 

జెఫ్‌ రహస్య స్నేహితురాలు లారెన్‌ సోదరుడే మిషెల్‌ ఈ వ్యవహారానికంతా కారణమని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశోధించిన సెక్యూరిటీ అధికారి కూడా ఇదే సంగతిని ధ్రువీకరిస్తున్నారు. 

రాజకీయ కారణాలతోనే మిషెల్‌ వీటిని లీక్‌ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. ట్రంప్‌ అంతర్గత మిత్రవర్గంలో మిషెల్‌ కూడా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. మిషెల్‌ ఈ సమాచారం లీక్‌ చేసినందుకు 2లక్షల డాలర్ల డబ్బు తీసుకొనే ఉంటాడని దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. 

సాధారణంగా డబ్బు చెల్లించని సమాచారాన్ని పత్రికలు ప్రచురించవు. కానీ ఇవి కేవలం వదంతులు మాత్రమేనని మిషెల్‌ కొట్టిపారేశాడు. దీనిపై బెజోస్‌, లారెన్‌ స్పందించాల్సి ఉంది. మిషెల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్నర్ సర్కిల్ సభ్యుడని, రాజకీయ కారణాలతోనే జెఫ్ బెజోస్ రహస్య సమాచారాన్ని బయట పెట్టి ఉంటాడని బెజోస్ నియమించిన సెక్యూరిటీ కన్సల్టెంట్ గవిన్ డీ బెకర్ కూడా ధ్రువీకరించారు. 
 

click me!