25-27 మధ్య మొబైల్ కాంగ్రెస్: ఒకే వేదికపైకి ముకేశ్ మిట్టల్

By Arun Kumar PFirst Published Oct 22, 2018, 10:37 AM IST
Highlights

టెలికం రంగ దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ అధినేతలు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నెల 25 - 27 తేదీల మధ్య జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో పాల్గొననున్నారు.

న్యూఢిల్లీ: టెలికాం రంగ దిగ్గజాలు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నెల 25-27 మధ్య ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌(ఐఎంసీ) జరగనుంది. టెలికాం రంగంలో ఎదురవుతున్న సమస్యలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ హాజరుకానున్నారు. వొడాఫోన్‌ ఐడియా ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

‘వివిధ టెలికాం సంస్థల నిర్వాహకులు ఐఎంసీలో పాల్గొంటారు’ అని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ తెలిపారు. అదే విధంగా అన్ని టెలికాం సంస్థల చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్లు కూడా ఈ సదస్సులో వివిధ అంశాలను చర్చిస్తారని పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు యూఎస్‌, యూకే, కెనడా దేశాల ప్రతినిధులు సైతం హాజరవుతారన్నారు.

‘బార్సిలోనాలో ఏటా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ జరుగుతుంది. అయితే, అందరూ ఆ సదస్సుకు వెళ్లలేరు. దక్షిణాసియాలో అటువంటి పెద్ద ఈవెంట్‌ ఎప్పుడూ నిర్వహించలేదు. అదే విధంగా ఆగ్నేయాసిలో ఉన్న బలమైన టెలికాం వ్యవస్థను ప్రపంచానికి చూపడంతో పాటు, టెక్నాలజీ అభివృద్ధి దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సదస్సుకు ఎఫ్‌సీసీ ఛైర్మన్‌ అజిత్‌పాయ్‌, యూరోపియన్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు ఆండ్రూస్‌ అన్సిప్‌, బిమ్స్‌టెక్‌(బే ఆఫ్‌ బెంగాల్‌ ఇన్షియేటివ్‌ ఫర్‌ మల్టీ సెక్టారల్‌ టెక్నికల్‌ అండ్‌ ఎకనమిక్‌ కో-ఆపరేషన్‌) సభ్యులు ఇందులో పాల్గొంటారు’ అని మాథ్యూస్‌ వెల్లడించారు.

ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) సదస్సు నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతున్నదని మాథ్యూస్ తెలిపారు. ఈ సదస్సులో 2500 మంది ప్రతినిధులు, 10 వేల మంది విజిటర్స్, 300 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. కేంద్ర టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా, కార్యదర్శి అరుణా సుందరరాజన్ తదితరులు పాల్గొంటారు. 250 స్టార్టప్ సంస్థలతో కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు మాథ్యూస్ వివరించారు. బిజినెస్ టు కన్జూమర్ ఎగ్జిబిషన్‌ను కాయ్ స్వయంగా ఏర్పాటు చేస్తున్నదని, ఇందులో శామ్ సంగ్, హువాయి, నోకియా తదితర మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలన్నీ పాల్గొంటాయని తెలిపారు. టెలికం రంగం పట్ల ఆసక్తి గల వారిని తమలో ఇముడ్చుకునేందుకు కళాశాలలు, యూనివర్శిటీలను సంప్రదిస్తున్నట్లు కాయ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మాథ్యూస్ చెప్పారు. 
 

click me!