బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు... ఏప్రిల్ 3న నిర్ణయం...

By Sandra Ashok KumarFirst Published Mar 17, 2020, 12:24 PM IST
Highlights

ఈ నెల 31-వచ్చేనెల మూడో తేదీ మధ్య జరిగే ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాల్లో మాత్రమే వడ్డీరేట్ల తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇప్పటికే అమెరికా ఫెడ్ రిజర్వు, బ్లాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి.
 

ముంబై: ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ మధ్య జరిగే ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో మాత్రమే వడ్డీరేట్లను తగ్గించే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.

అయితే మార్కెట్‌ ఇప్పటికే వ్యాపారాలపై కరోనా వైరస్ ప్రభావాన్ని నిలువరించేందుకు రెపో రేటు తగ్గించాలని కోరుతున్న దృష్ట్యా లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంటామని మాత్రం హామీ ఇచ్చారు. 

కరోనా వైరస్ (కోవిడ్‌-19) ప్రభావంపై స్పందించేందుకు ఆర్‌బీఐ నిర్వహించిన విలేకరుల సమావేశంలో శక్తికాంత దాస్ పలు కీలక ప్రకటనలు చేశారు. కరోనా ప్రభావాన్ని నిలువరించేందుకు ఆర్బీఐ వద్ద పలు విధానపరమైన చర్యలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. 

also read యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బి‌ఐ

తక్షణ వడ్డీరేట్ల కోత లేనట్టేనా అన్న ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందిస్తూ ప్రస్తుత చట్టం ప్రకారం కేవలం ఎంపీసీ మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. పరిస్థితిని బట్టి కార్యాచరణ ఏమిటన్నది నిర్ణయిస్తామని దాస్‌ స్పష్టం చేశారు. 

ఈ లోగా దేశంలో మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు ఈ నెల 23వ తేదీన 200 కోట్ల డాలర్లు విక్రయించడంతో పాటు దీర్ఘకాలిక రెపో కింద ఏ క్షణంలో అవసరమైతే అప్పుడు రూ.లక్ష కోట్లు అందించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది.

దేశంలోని బ్యాంకులన్నీ కరోనా వైరస్ ప్రభావం తమ పద్దులు, ఆస్తుల నాణ్యత, లిక్విడిటీపై ఎంత మేరకు పడింది ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని ఆర్‌బీఐ సూచించింది.

also read డొనాల్డ్ ట్రంప్ కు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణ....

కస్టమర్లు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని వాణిజ్య బ్యాంకులు, యూసీబీలు, ఎన్‌బీఎఫ్సీలు, పేమెంట్‌ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులనుద్దేశించి జారీ చేసిన ప్రకటనలో కోరింది. 

వ్యాపార, సామాజిక కోణాలు రెండింటిలోనూ కరోనా వైరస్ ప్రభావాన్ని తరచుగా సమీక్షిస్తూ సత్వరం స్పందించేందుకు బ్యాంకులు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ టీమ్‌లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బ్యాంకు అగ్ర నాయకత్వానికి తాజా స్థితిని తెలియచేస్తూ ఉండాలని తెలిపింది.

అమెరికా ఫెడ్ రిజర్వు ఇప్పటికే ఒకసారి వడ్డీరేట్లు తగ్గించినా ఆదివారం మరోదఫా జీరో స్థాయికి వడ్డీరేట్లు తగ్గించాలని నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 50 బేసిక్ పాయింట్లు తగ్గించాలని తీర్మానించింది. కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. 
 

click me!