మెటావర్స్‌ టెక్నాలజీపై కన్ను.. ‘‘యాక్టివిజన్ బ్లిజార్డ్‌’’ను చేజిక్కించుకోనున్న మైక్రోసాఫ్ట్, డీల్ ఎంతో తెలుసా

By Siva KodatiFirst Published Jan 18, 2022, 9:28 PM IST
Highlights

వీడియో గేమ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను (Activision Blizzard) టేకోవర్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ (Microsoft) సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 68.7 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం అనుకున్న ప్రకారం జరిగితే టెన్సెంట్, సోనీ తర్వాత ఆదాయంలో మూడవ అతిపెద్ద గేమింగ్ కంపెనీగా ఆవిర్భవిస్తుందని కార్పోరేట్ వర్గాలు చెబుతున్నాయి. 

వీడియో గేమ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను (Activision Blizzard) టేకోవర్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ (Microsoft) సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 68.7 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం అనుకున్న ప్రకారం జరిగితే టెన్సెంట్, సోనీ తర్వాత ఆదాయంలో మూడవ అతిపెద్ద గేమింగ్ కంపెనీగా ఆవిర్భవిస్తుందని కార్పోరేట్ వర్గాలు చెబుతున్నాయి. కాల్ ఆఫ్ డ్యూటీ (Call of Duty) , క్యాండీ క్రష్‌లను (Candy Crush) రూపొందించింది యాక్టివిజన్ బ్లిజార్డే. ఈ తాజా డీల్ మైక్రోసాఫ్ట్ 46 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద టేకోవర్. సాంప్రదాయ ఆన్‌లైన్ ప్రపంచాన్ని వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీతో మిళితం చేసే ‘‘మెటావర్స్’’ (metaverse) అని పిలిచే తదుపరి తరం ఇంటర్నెట్ కోసం జరుగుతున్న యుద్ధంలో తాజా డీల్‌తో మైక్రోసాఫ్ట్ సైతం జెండా పాతింది. 

మైక్రోసాఫ్ట్ ఇప్పటికే Xbox హార్డ్‌వేర్, వీడియో గేమ్ డెవలప్‌మెంట్ స్టూడియోలను కొనుగోలు చేయడం ద్వారా వీడియో గేమ్ ఇండస్ట్రీలో ఉనికిని చాటుతోంది. కాగా.. యాక్టివిజన్ బ్లిజార్డ్‌పై అనేక ఆరోపణలు వున్నాయి. మహిళా శ్రామిక శక్తిపై వివక్ష చూపడంతో పాటు.. ఫ్రాట్ బాయ్ వర్క్‌ప్లేస్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నట్లు ఆ కంపెనీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ మైక్రోసాఫ్ట్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. రెగ్యులేట్ ఏజెన్సీలు, యాక్టివిజన్ బ్లిజార్డ్ షేర్‌హోల్డర్లు దీనికి అంగీకారం తెలిపితే.. 2023 జూన్ నాటికి కొనుగోలు ప్రక్రియ ముగుస్తుంది. ఈ ఒప్పందానికి రెండు కంపెనీల డైరెక్టర్ల బోర్డులు ఇప్పటికే ఆమోదం తెలిపాయి. 

అయితే  లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలను ఎదుర్కొన్న యాక్టివిజన్‌ను కొనుగోలు చేయడంపై మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రం ఇప్పటికే యాక్టివిజన్‌పై కోర్టులో దావా వేసింది. దీంతో దాని షేర్లు 27 శాతం పడిపోయాయి. అయితే మైక్రోసాఫ్ట్ ఈ డీల్‌ను తెరపైకి తీసుకురావడంతో ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో యాక్టివిజన్ షేర్లు దాదాపు 40 శాతం పెరగ్గా.. మైక్రోసాఫ్ట్ షేర్లు 1 శాతం మేర పడిపోయాయి. 

click me!