జెఫ్ బెజోస్‌కే ఐడియల్: మాజీ భార్య మెకెంజీ 1.25 లక్షల కోట్లు దానం!

By rajesh yFirst Published May 30, 2019, 11:47 AM IST
Highlights

సంపదను స్రుష్టించడంతోపాటు విరాళాలు ప్రకటించడంలోనూ మెకంజీ బెజోస్ తన మాజీ భర్త జెఫ్ బెజోస్‌నే మించి పోయారు. 36 బిలియన్ల డాలర్ల చారిటీగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా గివింగ్ ప్లెడ్జ్ కింద విరాళాలు ప్రకటించిన 19 మంది భూరీ విరాళ దాతల్లో ఒకరయ్యారు.

లాస్‌ఏంజెల్స్: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ బెజోస్ తన సంపదలో సగ భాగాన్ని సేవా కార్యక్రమాలకే విరాళం ఇచ్చింది. మంగళవారం గివింగ్ ప్లెడ్జ్‌లో చేరిన ఆమె.. తన 36 బిలియన్ డాలర్ల సంపదలో సగ భాగాన్ని (రూ.1.25 లక్షల కోట్లు) ఛారిటీకిస్తున్నట్లు ప్రకటించింది. 

2010లో బెర్క్‌షైర్ హాథవే అధినేత వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ప్రారంభించిందే ఈ గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్. తాజా ప్రకటనతో బఫెట్, బిల్‌గేట్స్, మిలిందా గేట్స్ తదితర 19 మంది భూరీ విరాళ దాతల్లో మెకెంజీ బెజోస్ ఒకరయ్యారు.

మరోవైపు మెకెన్జీ నిర్ణయాన్ని ఆమె మాజీ భర్త జెఫ్ బెజోస్ సమర్థించారు. తాను గర్వపడుతున్నట్లు ట్వీట్ చేశారు. గత నెల నాలుగో తేదీన బెజోస్ దంపతులు విడాకులు తీసుకోగా, అమెజాన్‌లో మెకెంజ్‌కీ దాదాపు 36 బిలియన్ డాలర్ల విలువైన 4 శాతం వాటా దక్కింది.

ఈ ఏడాదికి జెఫ్ బెజోస్ సంపదను 131 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. మెకెంజీ బెజోస్ ప్రపంచంలోకెల్లా మూడో సంపన్న మహిళ అని ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. తన దాత్రుత్వం ఒక ఆలోచనగా కొనసాగాలన్నదే తన అభిమతం అని పేర్కొన్నారు. 

ఫోర్బ్స్ ప్రకటించిన 204 మంది సంపన్నుల్లో జెఫ్ బెజోస్ ఒకరు. వీరంతా ‘గివింగ్ ప్లెడ్జ్’ తీసుకున్న వారే. ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరు 23 దేశాల ప్రతినిధులుగా ఉన్నారు.

గివింగ్ ప్లెడ్జ్ తీసుకున్న టాప్ 10 బిలియనీర్లలో ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ గ్రూప్ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ అర్నాల్ట్, మెక్సికన్ టెలికం మాగ్నెట్ కార్లోస్ స్లిమ్, యూరోపియన్ ఫ్యాషన్ రిటైల్ మొగల్ అమాంసియో ఒర్టెగా, గూగుల్ కో ఫైండర్ కం అల్ఫాబెట్ సీఈఓ లార్రీ పేజ్ తదితరులు ఉన్నారు. 

click me!