
కార్పొరేట్ సెక్టార్‌లో ఓ కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకింగ్ సెగ్మెంట్ తరహాలోనే రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలు విలీనం అయ్యాయి. కొన్ని సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటూ వచ్చిన ఈ రెండు కంపెనీలు కూడా ఇప్పుడు ఒకే గొడుగు కిందికి వచ్చి చేరాయి. ఆ గొడుగు పేరు లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ). ఈ రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలు విలీనమైనట్లు ఎల్ అండ్ టీ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఈ విలీన ప్రక్రియను ధృవీకరించింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఏ ఎం నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
విలీనమైన ఈ రెండు కంపెనీలు ఎల్ అండ్ టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందినవే. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు తాజాగా విలీనం అయ్యాయి. ఇదివరకు బ్యాంకింగ్ సెక్టార్‌లో పెద్ద ఎత్తున ఈ విలీన ప్రక్రియ చోటు చేసుకుంది. కొద్దిరోజుల కిందటే హెచ్‌డీఎఫ్‌సీ-హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనమైన విషయం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్-మైండ్‌ట్రీ విలీనం ఖరారయింది.
ఎల్ అండ్ టీ సబ్సిడయరీ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ మైండ్‌ట్రీ. ఈ రెండు కూడా ఎల్ అండ్ టీకి చెందినవే. ఈ రెండు కంపెనీల వ్యాపార లావాదేవీలను 3.5 బిలియన్ డాలర్లకు చేర్చాలనే ఉద్దేశంతో విలీన ప్రక్రియను ప్రారంభించినట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీకి ప్రతిపాదనలను సమర్పించింది. దీనిపై షేర్ హోల్డర్లు, రెగ్యులేటరీ ఇంకా తన ఆమోదాన్ని తెలియజేయాల్సి ఉంది. నెల రోజుల్లో ఆమోదం లభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
విలీనం అనంతరం ఈ రెండు కంపెనీలు ఎల్టీఐమైండ్‌ట్రీ పేరుతో ఒకే సంస్థగా ఆవిర్భవిస్తాయని ఎఎం నాయక్ తెలిపారు. కస్టమర్స్, ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్, ఎంప్లాయిస్..ఇలా ఏ ఒక్కరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా విన్ టు విన్ ప్రాతిపదికన విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ఈ రెండు కంపెనీలు వేర్వేరుగా పని చేస్తోండటం వల్ల కొన్ని నివారించదగ్గ లోపాలు తలెత్తుతున్నాయని, చిన్నచిన్న ఓవర్‌ల్యాప్స్ ఉంటోన్నాయని చెప్పారు. ఏకీకృతం కావడం వల్ల మరింత బలోపేతమౌతాయని వ్యాఖ్యానించారు.
మార్కెట్‌లో ఉన్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవడం, ఖర్చును నియంత్రించుకోవడం.. వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎల్ అండ్ టీ టాప్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విలీనం అనంతరం టెక్ మహీంద్ర కంటే పెద్ద సంస్థగా ఇది ఆవిర్భవించనుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌కు దేబాశీష్ ఛటర్జీ, మైండ్‌ట్రీకి సంజయ్ జలోనా సారథ్యాన్ని వహిస్తున్నారు.