భారత్‌లో లక్ష నుంచి రూ.40 వేలకు దిగిరానున్న ల్యాప్‌టాప్ ధరలు.. రీజన్ ఇదే

By Siva KodatiFirst Published Sep 14, 2022, 7:45 PM IST
Highlights

గుజరాత్ కేంద్రంగా ఏర్పాటు కానున్న వేదాంత - ఫాక్స్‌కాన్ సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ వల్ల భారత్‌లో ల్యాప్‌టాప్ ధరలు రూ లక్ష నుంచి రూ. 40 వేలకు దిగిరానున్నాయి. ఈ మేరకు వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. 

చిప్‌ల కొరత , సప్లై చైన్ సమస్యల ఒత్తిడి కారణంగా భారతదేశంలో ల్యాప్‌టాప్‌ల సగటు ధర రూ.60 వేలకు మించి పెరిగింది. 2022 మొదటి త్రైమాసికంలో రికార్డ్ స్థాయిలో 5.8 మిలియన్ పీసీ షిప్‌మెంట్‌లు భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించినందున ఖరీదైన ఎలక్ట్రానిక్స్ డిమాండ్‌పై ప్రభావం చూపలేదు. మరోవైపు వేదాంత - ఫాక్స్‌కాన్ గుజరాత్‌ కేంద్రంగా దేశంలో తొలి సెమీకండక్టర్ తయారీ యూనిట్‌తో భారత టెక్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడానికి సిద్ధమైంది. 

సెమీ కండక్టర్లు, గ్యాస్‌లు తయారు చేసే దాదాపు రూ.1.54 లక్షల కోట్ల విలువైన ఈ ప్లాంట్ కారణంగా ప్రస్తుతం రూ. లక్ష వున్న ల్యాప్‌టాప్‌లు రూ.40 వేల లోపు ధరకు అందుబాటులో వుంటాయి. సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ మేరకు జోస్యం చెప్పారు. తైవాన్ , కొరియాలో తయారవుతున్న కాంపోనెంట్స్ త్వరలో భారత్‌లోనే తయారు చేయబడతాయని ఆయన అన్నారు. కంపెనీ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తోందని.. ఇందులో తైవాన్ ఎలక్ట్రానిక్స్ పవర్‌హౌస్ ఫాక్స్‌కాన్ 38 శాతం వాటాను కలిగివుందని అగర్వాల్ తెలిపారు. 

గుజరాత్‌లోని తయారీ కేంద్రం రెండేళ్ల తర్వాత సెమీ కండక్టర్‌ల ఉత్పత్తి, పంపిణీలను ప్రారంభించనుంది. దాదాపు 3.5 బిలియన్ల టర్నోవర్‌ను కంపెనీ ఆశిస్తోంది. ఎగుమతులు 1 బిలియన్ డాలర్లుగా వుంటాయని పరిశ్రమ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. భారత్ ప్రస్తుతం 100 శాతం సెమీ కండక్టర్లను దిగుమతి చేసుకుంటోందని.. 2020లో ఎలక్ట్రానిక్స్‌ను సేకరించేందుకు ఇండియా 15 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ఇందులో 37 శాతం చైనా నుంచే వచ్చింది. తర్వాత చైనా ఎగుమతులపై ఆధారపడటాన్ని భారత్ 20 శాతం తగ్గించినప్పటికీ... అది మన జీడీపీలో 8 బిలియన్ డాలర్ల మేర వుంటుందని స్టేట్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. 

సెమీ కండక్టర్‌లను తయారు చేసే వేదాంత వంటి కంపెనీలకు భారత్‌లో రూ.76000 కోట్ల ఆర్ధిక సాయం వుంది. దీనిని సంస్థల ఖర్చులో 50 శాతం వరకు ఆర్ధిక సహాయం చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. తద్వారా భవిష్యత్‌లో సొంతంగా మైక్రోచిప్‌లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం, సాంకేతికతపై ఆధిపత్యం చెలాయించేలా భారత్ స్వయం సమృద్ధి సాధించేలా దోహదం చేస్తోంది.

click me!