‘కోటక్‌’లో బఫెట్ వాటా కొనుగోలు: ఆర్బీఐ అనుమతిస్తుందా?

By rajesh yFirst Published Dec 8, 2018, 10:16 AM IST
Highlights

ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బపెట్.. దేశీయ ప్రైవేట్ బ్యాంక్ కోటక్‌- మహీంద్రాలో 10 శాతం వాటా కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తన సంస్థ ‘బెర్క్‌షైర్‌ హాత్‌వే రూ.40,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. అయితే దీనికి ఆర్బీఐ ఆమోద ముద్ర వేస్తుందా? అన్నది అనుమానమే

ముంబై: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ప్రముఖ మదుపరి వారెన్‌ బఫెట్‌ వాటాను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన సంస్థ బెర్క్‌షైర్‌ హాత్ వే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో 10 శాతం వాటా కొనేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు రూ.30,000- 40000 కోట్ల వరకు (400-600 కోట్ల డాలర్లు) వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ వాటా కొనుగోలు ప్రక్రియ కార్యరూపం దాలిస్తే ప్రమోటర్లకు ఆర్బీఐ నిర్దేశించిన వాటా పరిమితి నిబంధనలను అమలు చేసినట్లు అవుతుంది. 

ప్రమోటర్లు తమ వాటాను 2018 డిసెంబర్ కల్లా 20 శాతానికి, 2020 మార్చి కల్లా 15 శాతానికి తగ్గించుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆయా సంస్థలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఇప్పుడు బెర్క్‌షైర్‌ కూడా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రమోటరు ఉదయ్‌ కోటక్‌కు చెందిన 10 శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటోంది. ఈ లావాదేవీ పూర్తికావాలంటే ఆర్బీఐ అనుమతి అవసరం అవుతుంది. 

ప్రమోటర్లు వాటాను తగ్గించుకునే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున ఆర్బీఐ ఈ తరహా వాటా విక్రయ ప్రతిపాదనకు అంగీకరించకపోవచ్చునని అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ ప్రమోటర్ల వాటా తగ్గింపు ప్రతిపాదన కోసం ఆర్‌బీఐని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అనుమతి కోరింది. కానీ నిబంధనలకు అనుగుణంగా లేదని ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. బంధన్‌ బ్యాంక్‌ విషయంలోనూ ఇదే జరిగింది.

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో బెర్క్‌షైర్‌ హాథ్‌వే వాటా కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వివరణ అడగగా.. ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదనల గురించి మాకు తెలియదని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ స్పష్టం చేసింది. దానిపై వివరణ ఇచ్చేందుకు కూడా ఏమీ లేదన్నది. మరోవైపు వాటా కొనుగోలు అంశంపై బెర్క్‌షైర్‌ హాథ్‌వేను కూడా ఇ-మెయిల్‌ ద్వారా అడగగా.. ఎలాంటి స్పందన లేదు. మరోవైపు మార్కెట్‌ వర్గాలు కూడా ఈ తరహా లావాదేవీ ప్రతిపాదనకు అవకాశం ఉండకపోవచ్చని అంటున్నాయి. 

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఉదయ్‌ కోటక్‌కు చెందిన 10 శాతం వాటాను బెర్క్‌షైర్‌ కొనుగోలు చేయనున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు చివరికల్లా రెండు సంస్థలు ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నాయి. దీనిపై వచ్చే పదిహేను రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని మరికొన్ని వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు సంబంధించి ఇది రెండో అతిపెద్ద లావాదేవీ అవుతుంది. 2015లో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను పూర్తిగా నగదు రూపేణా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2018 సెప్టెంబరు చివరినాటికి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఉదయ్‌ కోటక్‌కు 29.73 శాతం వరకు వాటా ఉంది. కోటక్ షేర్ మాత్రం బారీగానే పెరిగింది.

click me!