ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలో జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం ప్రకటించింది. భారతదేశంలో అత్యుత్తమ, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్, వినోద అనుభవాల కోసం ఒక డెడికేటెడ్ రిటైల్ గమ్యస్థానం అని కంపెనీ తెలిపింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్‌ను నవంబర్ 1న ప్రారంభించనుంది. 'జియో వరల్డ్ ప్లాజా' పేరుతో కంపెనీకి చెందిన ఈ మాల్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 7,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. బల్గారీ, కత్యాయ్, లూయిస్ విట్టన్, వెర్సేస్, వాలెంటినో, మనీష్ మల్హోత్రా, అబు జానీ, సందీప్ ఖోస్లా, పోటరీ బార్న్ , అనేక ఇతర ఖరీదైన బ్రాండ్‌లు ఈ మాల్‌లో అందుబాటులో ఉంటాయి.
ఇది భారతదేశంలో బల్గారీ మొదటి స్టోర్ కావడం విశేషం. ప్రస్తుతం భారతదేశంలో విలాసవంతమైన ఖరీదైన వస్తువులు మాత్రమే అందుబాటులో ఉన్న కొన్ని మాల్స్ మాత్రమే ఉన్నాయి. వీటిలో డిఎల్‌ఎఫ్ ఎంపోరియో, చాణక్య మాల్, యుబి సిటీ పల్లాడియం ఉన్నాయి. ఇంతకు ముందు కొన్ని ఖరీదైన బ్రాండ్లు ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే ఉండేవి.
భారతదేశంలో ఖరీదైన వస్తువుల పట్ల ప్రజల దృక్పథం మారిందని, వారి డిమాండ్ నిరంతరం పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ మహమ్మారి తర్వాత సంవత్సరాలలో ఈ వస్తువుల డిమాండ్ గణనీయంగా పెరిగిందని అంచనా వేస్తున్నారు.
CBRE రిటైల్ (ఇండియా) హెడ్ విమల్ శర్మ మాట్లాడుతూ, “విదేశాల్లో షాపింగ్ చేయడానికి బదులుగా ఇప్పుడు భారత్‌లోనూ ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని, అంతేకాదు భారత్‌లో విక్రయించే లగ్జరీ వస్తువులకు, అంతర్జాతీయ మార్కెట్‌కు మధ్య ధర వ్యత్యాసం కూడా తగ్గిందని విమల్ శర్మ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న వస్తువులు ప్రస్తుత సీజన్‌కు చెందినవేనని, పాత స్టాక్ కాదని శర్మ చెప్పారు. దీంతో దేశంలో ఖరీదైన వస్తువులకు డిమాండ్ కూడా పెరిగిందని ఈ సందర్భంగా శర్మ అభిప్రాయపడ్డారు.
స్టాటిస్టా డేటా ప్రకారం, 2023 సంవత్సరంలో, దేశంలో ఖరీదైన వస్తువుల మార్కెట్ విలువ 7.74 బిలియన్ డాలర్లు. దీని పరిమాణం వార్షిక ప్రాతిపదికన 1.38 శాతం (CAGR 2023-2028) చొప్పున పెరుగుతుందని అంచనా వేయబడింది. డేటా ప్రకారం, భారతదేశంలో ఖరీదైన వస్తువులలో లగ్జరీ గడియారాలు ఆభరణాలు అతిపెద్ద విభాగాలుగా ఉన్నాయి, దీని మార్కెట్ 2023లో 2.24 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు.
జియో వరల్డ్ ప్లాజా విషయానికి వస్తే రిటైల్, విశ్రాంతి, భోజనాల కోసం ప్రత్యేకమైన హబ్‌గా రూపొందించారు. 7,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు స్థాయిలకు విస్తరించి, రిటైల్ మిక్స్ 66 లగ్జరీ బ్రాండ్‌ల ఆకట్టుకునే జాబితాను కలిగి ఉంది. బాలెన్‌సియాగా, జార్జియో అర్మానీ కేఫ్, పోటరీ బార్న్ కిడ్స్, శామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, EL&N కేఫ్, రిమోవా వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఈ ప్లాజా ద్వారా నూతనంగా భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ముంబై వాలెంటినో, టోరీ బుర్చ్, YSL, వెర్సేస్, టిఫనీ, లాడూరీ అండ్ పోటరీ బార్న్ మొదటి స్టోర్‌లు కూడా ఈ ప్లాజాలో ఉన్నాయి. అయితే కీలకమైన ఫ్లాగ్‌షిప్‌లలో లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బల్లీ, జార్జియో అర్మానీ, డియోర్, YSL, బల్గారీ వంటి ఇతర ఐకానిక్ బ్రాండ్‌లు సైతం ఈ ప్లాజాలో ఉన్నాయి.