
గత కొన్నేళ్లుగా భారత్‌లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ముఖేష్ అంబానీలు తమ ఆధిపత్యం కోసం ఇరువురు పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఫ్యుచర్ గ్రూప్‌కు చెందిన వ్యాపారాలను పూర్తిగా హస్తగతం చేసుకుందమని భావిస్తోన్న ముఖేష్ అంబానీకి అమెజాన్ అడ్డుగా నిల్చుంది. ప్రస్తుతం ఈ కంపెనీలు ఐపీఎల్ ప్రసార హక్కుల (డిజిటల్)ను తీసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులపై అమెజాన్, రిలయన్స్ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. ప్రసార హక్కుల విషయంలో ఇప్పుడు ఇరువురి మధ్య ఐపీఎల్ మరో తీవ్రమైన పోటీకి దారితీస్తోంది.
కాసుల వర్షం కురిపించే డీల్ కోసం పోటీ మొదలైంది. అది కూడా అలాంటి ఇలాంటి పోటీ కాదు. ఏకంగా ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో ఉన్న ఇద్దరు ప్రముఖుల మధ్య తొలిసారి ముఖాముఖి పోరు మొదలైంది. ఐపీఎల్ టోర్నీ హక్కుల కోసం మొదలైన పోటీ భారీగా సాగుతోంది. పలు సంస్థలు ఈ హక్కల బిడ్ ను సొంతం చేసుకోవటం ద్వారా భారీగా ఆర్జించాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే.. ఈ హక్కులు ఎవరి సొంతం అవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ హక్కుల్ని తమ ఖాతాలో వేసుకునేందుకు దిగ్గజ సంస్థలు పోటాపోటీ పడుతున్నాయి. ఈ పోటీ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కార్పొరేట్ రంగంలో ఈ ఉదంతం ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి.
వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల పాటు జరిగే ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్లను ఆహ్వానించటం.. దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. టీవీ ప్రసార హక్కులతో పాటు ఆన్ లైన్ స్ట్రీమింగ్ హక్కుల్ని వేర్వేరుగా విక్రయిస్తోంది బీసీసీఐ. ఈ హక్కుల కోసం ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలు పోటీ పడుతున్నాయి. ఆ జాబితా కాస్త పెద్దదిగానే ఉంది. ఈ ప్రసార హక్కుల్ని సొంతం చేసుకోవటానికి అమెజాన్.. రిలయన్స్ సంస్థలతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. జీ నెట్ వర్కు.. ఫేస్ బుక్.. యూ ట్యూబ్ సైతం పోటీలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను బీసీసీఐ షురూ చేసింది.
తాజా లెక్కల ప్రకారం చూస్తే.. ఈ ప్రసార హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకు 7బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రసారహక్కుల కోసం ఎంతమంది పోటీ పడుతున్నా.. పోటీ మొత్తం అమెజాన్ వర్సెస్ రిలయన్స్ మధ్యనే ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ రెండు దిగ్గజ కంపెనీలు ముఖాముఖిన పోటీ పడటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్న ఇద్దరు సంపన్నులకు చెందిన సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఐపీఎల్ ప్రసార హక్కులు ఎవరి సొంతం అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బీసీసీఐపై కాసుల వర్షం..!
ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ వేలం జూన్ 12న జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకు కాసుల వర్షం కురియనుంది. బ్రాడ్ కాస్టింగ్ హక్కులతో బీసీసీఐకి దాదాపు రూ. 40,000 నుంచి రూ. 45,000 కోట్ల ఆదాయం ఖజానాలో చేరనున్నుట్లు సమాచారం. వేలం గెల్చుకున్న సంస్థలు 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను పొందుతాయి. 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియాకు రూ. 16,347.50 కోట్ల రూపాయలకు విక్రయించింది. స్టార్ ఇండియా మాతృ సంస్థ వాల్ట్ డిస్నీ అని తెలిసిందే. కాగా పలు నివేదికల ప్రకారం..ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ హక్కులను దక్కించుకునేందుకు అమెజాన్, రిలయన్స్‌తో పాటుగా సోనీ గ్రూప్, వాల్ట్ డిస్నీతో పోటీ పడనున్నాయి.