మరోమారు బైబ్యాక్ దిశగా ‘ఇన్ఫోసిస్` చర్యలు

By sivanagaprasad kodatiFirst Published Jan 9, 2019, 8:28 AM IST
Highlights

దేశీయ ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్` మరో దఫా షేర్ల బై బ్యాక్‌ ప్రకటించనున్నది. ఉద్యోగులకు ప్రత్యేక డివిడెండ్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు సంస్థలో ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ వైదొలిగారు.

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి బైబ్యాక్ ప్రకటించేయోచనలో ఉన్నది. దీంతోపాటు ప్రత్యేక డివిడెండ్, వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో నిధుల కేటాయింపుపై ఈ నెల 11వ తేదీన జరిగే బోర్డు సమావేశంలో చర్చించనున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.

అదేరోజు కంపెనీ మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేయనున్నది. ఈ సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలను బీఎస్ఈకి అందించనున్నది. కంపెనీ వద్ద మిగులు నిధులు అధికంగా ఉండటంతో గతేడాది ఏప్రిల్లోనే రూ.13 వేల కోట్ల వరకు వాటాదారులకు పంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదేక్రమంలో జూన్ నెలతో ముగిసిన 2018-19 తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసినప్పుడు ప్రకటించిన రూ.10 ప్రత్యేక డివిడెండ్ కోసం రూ.2,600 కోట్ల నిధులను వెచ్చించింది. మిగతా రూ.10,400 కోట్లను ఏ రూపంలో పంచేదానిపై సమాలోచనలు చేసి చివరకు డివిడెండ్కు మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇన్ఫోసిస్కు మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్  గుడ్ బై
ఇన్ఫోసిస్ నుంచి మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైదొలిగారు. ఇన్ఫోసిస్ ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ సుదీప్ సింగ్ రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కంపెనీలో పనిచేస్తున్న సుదీప్ తాజాగా తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.

అయితే ఆయన రాజీనామాకు గల కారణాలపై స్పష్టత లేదు. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించింది.  ప్రమోటర్లు, మేనేజ్‌మెంట్‌ మధ్య భేదాభిప్రాయాల కారణంగా గత ఏడాది ఏర్పడిన వివాదం సమసిపోయినప్పటికీ ఇన్ఫోసిస్‌ నుంచి చాలా ఏళ్లుగా వేధిస్తున్న ఉన్నతాధికారుల వలసలు మాత్రం ఆగట్లేదు. 

గతేడాది ఇన్ఫోసిస్ చాలా మంది కీలక ఉద్యోగులను కోల్పోయింది. సుదీప్ కంటే ముందు గతేడాది అక్టోబర్ నెలలో ఇన్ఫీ కన్సల్టింగ్ గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ రాజీనామా చేశారు. అంతకు ముందు ఆగస్టులో కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్ ఎండీ రంగనాథ్ కూడా సీఎఫ్వో పదవి నుంచి తప్పుకొన్నారు.

గతేడాది జనవరిలో కంపెనీ యూరప్ కార్యకలాపాల హెడ్ రాజేశ్ కృష్ణమూర్తి కూడా రాజీనామా చేశారు. ఇన్ఫీ హెల్త్కేర్కు హెడ్గా ఉన్న సంగీతా సింగ్, మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ నితేశ్ బంగా కూడా గతేడాది కంపెనీ నుంచి వైదొలిగారు.

click me!