అంచనాలకు అనుగుణంగానే ఇన్ఫోసిస్ ఫలితాలు: ఒక్కో షేర్ పై రూ.7 బోనస్

By sivanagaprasad kodatiFirst Published Oct 17, 2018, 9:07 AM IST
Highlights

దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రెండో త్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత నెలతో ముగిసిన త్రైమాసికానికి రూ.4,100 కోట్ల లాభం ప్రకటించింది. 

దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రెండో త్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత నెలతో ముగిసిన త్రైమాసికానికి రూ.4,100 కోట్ల లాభం ప్రకటించింది. మార్కెట్ విశ్లేషకులు ఇన్ఫోసిస్ రూ.4,048 కోట్ల లాభాలు గడిస్తుందని అంచనా వేశారు.

తదనుగుణంగా జూన్‌ త్రైమాసికంలో ప్రకటించిన రూ.3,600 కోట్ల కంటే ఇది ఎక్కువ. గతేడాది రెండో త్రైమాసికంలో రూ.3,726 కోట్ల లాభాలు ప్రకటించింది. రెండో త్రైమాసికంలో మొత్తం రూ.20,609 కోట్ల ఆదాయం లభించింది. ఈ లెక్కన ఇన్ఫోసిస్‌ క్రమం నిరంతరం 6-8శాతం వృద్ధిని నమోదు చేసినట్లయింది. దీంతో ప్రతిషేర్‌కు రూ.7 చొప్పున బోనస్‌ ప్రకటించింది.

‘సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో వివిధ దేశాల్లోని మా అన్ని వ్యాపారాల్లో వృద్ధి నమోదు చేయడం సంతోషంగా ఉంది. కస్టమర్లతో మాకున్న బలమైన అనుబంధానికి ఇదే నిదర్శనం. డిజిటల్‌ విభాగం పూర్తి స్థాయిలో సేవలు అందిస్తోంది.

మా వినియోగదారుల అవసరాలపై పూర్తిగా దృష్టిపెట్టాము. దీంతో మేము ఈ త్రైమాసికంలో కొత్తగా రెండు బిలియన్‌ డాలర్లు విలువైన ఆర్డర్లను సొంతం చేసుకున్నాం. సమీప భవిష్యత్‌లో ఇవి మా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది’ అని ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ లాభాలను స్థిరంగా 22-24 శాతం ప్రగతిని నమోదు చేసింది. డాలర్ల రూపేణా ఆదాయం 2,921 మిలియన్ల డాలర్లు పెంచుకున్నది. గతేడాదితో పోలిస్తే 7.1 శాతం, త్రైమాసికంతో పోలిస్తే 3.2 శాతం వ్రుద్ధి రికార్డైంది. భారతీయ కరెన్సీలో వ్రుద్ధి 4.2 శాతంగా నమోదైంది. డాలర్లలో నికర లాభాలు 581 మిలియన్ల డాలర్లు (0.5%) వ్రుద్ధి సాధించింది. 
 

click me!