దేశంలో కోటీశ్వరుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అంతేకాదు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య కూడ పెరిగిందని రికార్డులు చెబుతున్నాయి.
న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను కట్టే కోటీశ్వరుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. 2018-19లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరిందని ఆదాయంపన్ను శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో ఈ సంఖ్యలో 20 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
రూ.కోటికి పైగా ఆదాయం కలిగి ఐటీ రిటర్న్ సమర్పించిన వారిలో 49,128 మంది వేతన జీవులే ఉండడం విశేషం. గత ఏడాది వీరి సంఖ్య 41,457 మాత్రమే.
ఇక హిందూ అవిభాజ్య కుటుంబాల్లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న కుటుంబాలు 1.67లక్షలుగా నమోదైనట్లు ఐటీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఈ సంఖ్య 1.33 లక్షలకు పరిమితమైంది. ఏడాదిలో దాదాపు 19 శాతం వృద్ధి కనిపించింది.
రూ.కోటికి పైగా ఆదాయం పన్ను చెల్లిస్తున్నవారి సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరంలో వీరి సంఖ్య 16,759కు చేరింది. గతేడాది 14,068 మంది రూ.కోటికి పైగా ఆదాయం పన్ను చెల్లించారు.
ఈ అసెస్‌మెంట్ సంవత్సరంలో 2.62 కోట్ల మంది ఎటువంటి ఆదాయం చూపకుండానే రిటర్నులు ఫైల్ చేశారు. 82 లక్షల మంది తమ ఆదాయం రూ.5.5 లక్షల నుంచి రూ.9.5లక్షల మధ్యలో ఉన్నట్లు పేర్కొన్నారని ఆదాయం పన్ను శాఖ తెలిపింది.
గతేడాది డిసెంబర్ చివరికల్లా 6.21 కోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేశారు. వాటిలో అంతకుముందు సంవత్సరాల అసెస్‌మెంట్స్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 2085 మంది వ్యక్తులు తమకు ఇళ్ల ద్వారా రూ.కోటికి పైగా ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
రూ.కోటికి పైగా దీర్ఘకాల మూలధన లాభాలు పొందినట్లు ప్రకటించిన వ్యక్తుల సంఖ్య సైతం 6750 నుంచి 8629 మందికి పెరిగింది. 17320 కంపెనీలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు ప్రకటించాయి. గతేడాది (2017-18)లో ఈ సంఖ్య కేవలం 12,990 కంపెనీలు మాత్రమే.
రూ.2.5 లక్షల వరకు వార్షికాదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదు. రూ.2.5-రూ.5 లక్షల వరకు ఐదు శాతం, రూ.10 లక్షల పైన 30 శాతం పన్ను విధిస్తున్న సంగతి తెలిసిందే.