
హ్యుందాయ్ మోటార్స్ కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతుంది. ఇందుకు సంబంధించి సంస్థ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే హ్యుందాయ్ ఇండియా భారత్‌కు క్షమాపణలు చెప్పాలని పెద్ద సంఖ్యలో నెటిజన్లు, పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. #BoycottHyundai అంటూ ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హ్యుందాయ్ మోటార్స్ తాజాగా మరో ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
తమ కంపెనీ వ్యాపార విధానంగా ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో రాజకీయ, మతపరమైన సమస్యలపై వ్యాఖ్యానించదని హ్యుందాయ్ ఇండియా తెలిపింది. పాకిస్తాన్‌లోని స్వతంత్ర యాజమాన్యంలోని డిస్ట్రిబ్యూటర్ ఖాతా నుంచి కాశ్మీర్ సంబంధిత పోస్ట్ ఆ విధానాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. ఆ పోస్టును తొలగించినట్టుగా పేర్కొంది. భవిష్యత్తులో ఇటువంటి పోస్ట్‌లు మళ్లీ పునరావృతం కాకుండా నిరోధించడానికి ప్రక్రియలను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. అనధికార సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా భారత ప్రజల ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినందుకు తాము తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొంది. హ్యుందాయ్ మోటార్స్ అనేక దశాబ్దాలుగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతుందని గుర్తుచేసింది. భారతీయ వినియోగదారులకు కోసం తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
అయితే అసలు వివాదం ఎలా మొదలైంది.. హ్యుందాయ్ కంపెనీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 5వ తేదీన పాకిస్తాన్‌లో కశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కశ్మీరీ సంస్మరణ దినాన్ని జరుపుకుంటారు. అయితే అదే రోజు.. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ (@HyundaiPakistanOfficial) ఓ పోస్టు కనిపించింది. ‘మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుచేసుకుందాం. వారు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు మద్దతుగా నిలబడదాం. #HyundaiPakistan #KashmiriSolidarityDay’ అని పోస్ట్ చేసింది. ఆపై పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తంకాగా.. ఆ పోస్టులు తొలగించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ పోస్టకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. దీంతో హ్యుందాయ్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ కంపెనీ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందటూ కామెంట్స్ చేశారు. బాయ్‌కాట్ హ్యుందాయ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా కొందరు నెటిజన్లు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హ్యుందాయ్ ఇండియా నుంచి ఒక ప్రకటన విడుదలైంది. 25 ఏళ్లుగా తమ కంపెనీ భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తుందని వెల్లడించింది. జాతీయవాదానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని పేర్కొంది. సున్నితమైన అంశాలలో తాము కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. హ్యుందాయ్ ఇండియాను లింక్ చేస్తూ వస్తున్న పోస్టులు కంపెనీ నిబద్దతను, దేశం కోసం చేస్తున్న సేవను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్బంగా హ్యుందాయ్ బ్రాండ్‌కు భారత్ రెండో ఇల్లు అని పేర్కొంది.
అయితే ఆ తర్వాత కూడా హ్యుందాయ్‌పై వ్యతిరేకత వ్యక్తమవతునే ఉంది. హ్యుందాయ్ వివరణ సరిగా లేదని.. క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. అనవసరమైన వివరణలు అవసరం లేదని.. సూటిగా క్షమాపణలు చెప్పాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ డిమాండ్ చేశారు. పలువురు రాజకీయ నేతలు హ్యుందాయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కంపెనీ నుంచి తాజా ప్రకటన వెలువడింది.