
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 200 నగరాలకు డీజిల్ డోర్ డెలివరీ సేవలను విస్తరించనున్నట్టు హమ్‌సఫర్ ఇండియా ప్రకటించింది. ఈ రంగంలో అత్యధిక మార్కెట్ వాటా కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ-మొబైల్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్ల రంగంలోకి కూడా దిగాలనుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే సంబంధిత కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం ఈ కంపెనీ 100 నగరాల్లో సేవలు అందిస్తోంది. మార్కెట్‌లో మరింత చొచ్చుకుపోయేందుకు గల అవకాశాలను పరిశీలిస్తూనే, విదేశీ మార్కెట్లలో గల అవకాశాలను కూడా వెతుకుతున్నట్టు తెలిపింది.
ఇంధనం ఇంటి వద్దనే డెలివరీ ఇచ్చే సేవలకు వేగవంతంగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో మరింత వేగం పుంజుకుంది. అంతర్జాతీయ సరఫరా అంతరాయాలు, ఇంధన వర్తకం తీరుతెన్నులు, ప్రస్తుత పంపిణీ విధానంలో ఉన్న పరిమితుల దృష్ట్యా డోర్ డెలివరీకి డిమాండ్ పెరిగిందని హమ్ సఫర్ కో- ఫౌండర్ సాన్యా గోయల్ తెలిపారు.
ప్రస్తుతం డీజిల్ డోర్ డెలివరీలో 20 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని 30 శాతంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మొబైల్ పెట్రోల్ పంపుల ద్వారా డీజిల్ తీసుకురావడం కంపెనీ సాధించిన విజయాల్లో ఒకటని ఆమె వివరించారు. ‘మేం దేశంలోని ప్రతి మూలకూ వెళ్లాలనుకుంటున్నాం. అన్నిరకాల ఇంధనాల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తేవాలనుకుంటున్నాం..’ అని వివరించారు. కంపెనీ కొత్తగా ‘సఫర్’ పేరుతో 20 లీటర్ల మెటాలిక్ జార్ క్యాన్ ద్వారా ఇంధనం సరఫరా చేస్తోందని, దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు.
అంతర్జాతీయంగా ఇంధన పంపిణీల్లో అనేక మార్పలు చోటు చేసుకుంటున్నాయని, తాము గ్రీన్ ఎనర్జీ మార్కెట్లో కూడా ప్రవేశించాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఈ-హమ్‌సఫర్ పేరుతో మొబైల్ పెట్రోలు పంపులు ఆవిష్కరించాలనుకుంటున్నామని, ఈ-వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్ల బిజినెస్‌లోకి ప్రవేశించాలనుకుంటున్నట్టు తెలిపారు.