
దేశంలో అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ తన రుణ గ్రహీతలకు వరుస పెట్టి షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇదివరకే రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్స్‌ను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ ఇవ్వాళ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. ఇందులో 35 బేసిస్ పాయింట్లు సవరించింది. దీని ఫలితంగా గృహావసరాల కోసం మంజూరు చేసిన రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి. కార్ల రుణాల వడ్డీ రేట్లు సైతం పైపైకి ఎగబాకనున్నాయి.
ఈ నెల 1వ తేదీన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యం తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్స్‌ను పెంచిన విషయం తెలిసిందే. కిందటి నెలలో రెండుసార్లు ఆర్పీఎల్‌ఆర్‌ను పెంచింది. మరోసారి వాటిని సవరించింది. జూన్ నెల తొలి రోజే దాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అయిదు బేసిస్ పాయింట్ల మేర ఆర్పీఎల్‌ఆర్‌ను పెంచినట్లు వివరించింది.
కిందటి నెల 9వ తేదీన 30 బేసిస్ పాయింట్లను పెంచిన విషయం తెలిసిందే. దీనివల్ల 30 లక్షల రూపాయల వరకు గృహ రుణాలను తీసుకున్న వారు ప్రతినెలా 7.10 శాతం మేర ఈఎంఐను చెల్లించాల్సి వచ్చింది. 30 నుంచి 75 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుని ఉంటే వారిపై 7.35 శాతం, రుణ మొత్తం 75 లక్షలకు పైగా ఉంటే 7.45 శాతం ఈఎంఐ వర్తించింది. ఇప్పుడు దీనికి మరో అయిదు బేసిస్ పాయింట్లను జత చేసింది. ఫలితంగా ఈ ఈఎంఐ శాతం మరింత పెరిగింది.
ఇప్పుడు తాజాగా ఎంసీఎల్ఆర్‌ను పెంచింది హెచ్‌డీఎఫ్‌సీ. ఏకంగా 35 బేసిస్ పాయింట్లను సవరించింది. ఇవ్వాళ్టి నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల గృహాలు, వాహనాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు భారీగా పెరగనున్నాయి. ఎంసీఎల్ఆర్ పెంపు ఇప్పుడు 7.50 శాతానికి చేరింది. ఇదివరకు ఈ సంఖ్య 7.15 శాతం మాత్రమే. ఒక నెల ఎంసీఎల్ఆర్ రేట్ 7.55, మూడు నెలలకు-7.60, ఆరు నెలలకు 7.70 శాతానికి పెరిగింది. ఏడాదికి 7.85 శాతంగా మారింది. రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటే దీని సంఖ్య 7.95 శాతానికి చేరుతుంది. మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 8.05 శాతానికి చేరింది. ఇది మరింత రుణ గ్రహీతలకు మరింత భారం కానుంది. తమ నెలవారీ ఈఎంఐల మొత్తం మరింత పెరగడం వల్ల అదనపు ఆర్థిక భారాన్ని భరించక తప్పని పరిస్థితి ఎదురైంది.
ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ రుణ రేట్లు పెంచాయి. ఇవ్వాళ్టి నుంచే అవి అమల్లోకి వచ్చాయి. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచాయి ఈ రెండు బ్యాంకులు కూడా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్జినల్ కాస్ట్‌కు అదనంగా 15 బేసిస్ పాయింట్లను జత చేసింది. ఫలితంగా సంవత్సరానికి కట్టాల్సిన మార్జినల్ కాస్ట్ 7.4 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ తన వార్షిక మార్జినల్ కాస్ట్‌ను 7.55 శాతానికి పెంచింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక మార్జినల్ కాస్ట్ 7.35 శాతంగా ఉంది.