జీఎస్టీ షాక్ ఇది: అక్షరాల ప్రచారానికి రూ.132 కోట్లు

By sivanagaprasad KodatiFirst Published Sep 4, 2018, 7:39 AM IST
Highlights

దేశ ఆర్థిక సంస్కరణల్లో నవశకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుపై ప్రజల్లో అవగాహన కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రింట్, డిజిటల్, టీవీ మీడియాలో ప్రచారం చేసేందుకు అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించింది. ఇందుకోసం రూ.132 కోట్లు ఖర్చు చేసిందని ‘సహ’ చట్టంతో బయటపడింది. 

దేశ ఆర్థికవ్యవస్థ చరిత్రలో నవశకంగా అభివర్ణిస్తూ గతేడాది జూలై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రచారానికి కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది. తొలుత పలు శ్లాబుల్లో జీఎస్టీ వసూలు చేసిన కేంద్రం దీని కింద దేశంలోని అన్ని రకాల వస్తువులు, సేవలపై నాలుగు శ్లాబుల్లో పన్నులను విధిస్తోంది

జీఎస్టీ అమలుపై వ్యాపార, వాణిజ్య వర్గాలు మొదలు సామాన్యుల వరకు అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ప్రజలకు అవగాహన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు రకాలుగా ప్రకటనలు ఇచ్చింది. మరి ఈ వాణిజ్య ప్రకటనల కోసం కేంద్రం చేసిన ఖర్చెంతో తెలుసా? అక్షరాలా రూ. 132.38కోట్లు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది.

జీఎస్టీ ప్రకటనలు, ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చెంతో చెప్పాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఓ దరఖాస్తు దాఖలైంది. ఈ దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జవాబిచ్చింది. ప్రింట్‌ మీడియాలో జీఎస్టీ ప్రకటనల కోసం రూ.126,93,97,121 ఖర్చు చేసినట్లు సమాచార, ప్రసార శాఖ తన సమాధానంలో పేర్కొంది. ఇక ఔట్‌డోర్‌ ప్రకటనలకు రూ.5,44,35,502 ఖర్చు చేయగా.. ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రకటనలకు ఎలాంటి ఖర్చు చేయలేదని వెల్లడించింది.

2017 జులై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ పన్నును అమలు చేయడానికి ముందే ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం మీడియా ద్వారా అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇచ్చింది. జీఎస్టీ ప్రక్రియ, నిబంధనలు తదితర వివరాలతో ప్రముఖ వార్తాపత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు ఇచ్చింది. అంతేగాక జీఎస్టీ ప్రచారం కోసం బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించింది.
 

click me!