మోదీజీ! జీఎస్టీపై ఐఎంఎఫ్ మాట వినండి ప్లీజ్!!

First Published Jul 2, 2018, 5:10 PM IST
Highlights

బెంజికారుకు, పాల ప్యాకెట్టుకు ఒకే పన్ను విధించలేమని జీఎస్టీ సరళతరంపై ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలను ఎద్దేవా చేసిన సంగతెలా ఉన్నా ఆర్థిక ప్రగతి రేటు సుస్థిరంగా పెరిగేందుకు జీఎస్టీని సరళతరం చేయాల్సిందేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హితవు చెప్పింది. 

వాషింగ్టన్: అత్యున్నత వృద్ధిరేటు సాధించడానికి తగు సంస్కరణలు చేపట్టాలని నరేంద్రమోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హితవు పలికింది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అమలులోకి తేవాలని, ద్రవ్య నియంత్రణ చర్యలను కొనసాగిస్తూ జీఎస్టీ శ్లాబ్‌లను సరళతరం చేసి క్రమబద్ధీకరించాలని మోదీ సర్కార్‌కు సోమవారం సూచించింది. ఇప్పటివరకు కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలను అదే ఊపులో కొనసాగించాలని తెలిపింది. 2017 - 18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆర్థిక ప్రగతి 7.7 శాతానికి దూసుకెళ్లింది. అంతకుముందు త్రైమాసికంలో ఏడు శాతంగానే నమోదైంది. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం బెంజికారుకు, పాల ప్యాకెట్‌కూ ఒకే స్లాబ్ పన్ను ఎలా విధిస్తామని విపక్షాలపై ఎదురుదాడికి దిగుతుండటం గమనార్హం. 

రికవరీ దిశగా భారత ఆర్థిక వ్యవస్థ


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్రీ రైస్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘2018 - 19 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ కొనసాగుతుందని మేం అంచనా వేస్తున్నాం’ అని చెప్పారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం ప్రగతి సాధిస్తుందని అంచనా వేసింది. 

ప్రగతికి త్రిసూత్ర పథకం ఇలా


ఆర్థిక వ్యవస్థలో సుస్థిర ప్రగతి సాధించడానికి ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్రీ రైస్ త్రి సూత్రాల పథకాన్ని ప్రకటించారు. తొలుత బ్యాంకు రుణ పరపతి సౌకర్యం పునరుద్ధరించాలని సూచించారు. రుణ ప్రొవిజన్ సామర్థ్యాన్ని విస్తరించాలని గెర్రీ రైస్ తెలిపారు. బ్యాంకింగ్, కార్పొరేట్ సంస్థల్లో బాలెన్స్ షీట్లు క్లీన్ అప్ చేయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలను విస్తరించాలని హితవు చెప్పారు. ప్రజలకు రుణ పరపతి పెంపొందిస్తూ ద్రవ్య నియంత్రణ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్రీ రైస్ చెప్పారు.

జీఎస్టీ స్లాబ్‌ను సరళతరం చేయాల్సిందే


మరోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళతరం చేసి క్రమబద్ధీకరించాల్సి ఉన్నదని తెలిపారు. కీలక మార్కెట్ రంగాల్లో మధ్య కాలిక సంస్కరణలను కొనసాగించాల్సి ఉన్నదని ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్రీ రైస్ అన్నారు. ఉదాహరణకు కార్మిక, భూ చట్టాల్లో మార్పులను ప్రోత్సహించాలని సూచించారు. పోటీ తత్వంతో కూడిన ప్రస్తుత ప్రపంచంలో స్థూలంగా వాణిజ్య అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు మార్కెట్ రంగంలో సంస్కరణలు ఎంతో కీలకం అని స్పష్టం చేశారు. తద్వారా మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ చాలా ఉన్నత స్థాయిలో వ్రుద్ధి చెందుతుందని గెర్రీ రైస్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 

18న భారత ఐఎంఎఫ్ భేటీలో క్షుణ్ణంగా చర్చిస్తాం


ఈ నెల 18న జరిగే ఐఎంఎఫ్ పాలక మండలి.. భారత వార్షిక సమావేశం జరుగనున్నదని చెప్పారు. ఈ సమావేశంలో జీఎస్టీ గురించి సవివరంగా చర్చిస్తామన్నారు. జీఎస్టీని అమలు చేయడానికి సంక్లిష్టంగా ఉన్నదని అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ వ్యవస్థను సరళతరం చేయడానికి ఆయా వర్గాల నుంచి సూచనలు, సలహాలు అందజేయాలని సూచించారు. ఈ నెల 16వ తేదీన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్‌పై ఐఎంఎఫ్ నివేదిక విడుదల చేయనున్నది.

click me!