ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. కర్ణాటకలో క్వింటాల్ టమాటా ధర 660 రూపాయలకు దిగివచ్చింది. దీంతో రిటైల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు విదేశాల నుంచి సైతం టమాటాలను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో, స్థానికంగా కూడా టమాటా ధరలో నెమ్మదిగా దిగివస్తున్నాయి.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగిపోయాయి ఫలితంగా ఒక కేజీ టమాటా ధర సుమారు రూ. 150 నుంచి రూ. 200 సమీపంలో పలుకుతోంది. దీంతో సామాన్యుల వంటకాలు నుంచి టమాట మాయమైపోయింది. అయితే నెమ్మదిగా టమాటాలు తదుముఖం పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా టమాటా అత్యధికంగా పండించే తమిళనాడు రాష్ట్రంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా చిత్తూరు, మదనపల్లి అలాగే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో టమాట సాగు అత్యధికంగా సాగుతుంది. సమీపంలోని చెన్నై కోయంబేడు మార్కెట్లో టమాటా ధర 80 రూపాయలు వద్ద లభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కర్ణాటకలోని చిక్బల్లాపూర్ మార్కెట్లో టమాట క్వింటాలు ధర 660 రూపాయలు పలికినట్లు తెలుస్తోంది. గతంలో క్వింటాల్ టమాటా ధర వెయ్యి రూపాయలు దాటింది. అంటే రిటైల్ మార్కెట్లో టమాటా ధర 70 నుంచి 80 రూపాయలు పలికే అవకాశం ఉంది. రాబోయే కొన్ని వారాల్లో టమాటా ధర సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు తో పాటు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో టమాటా అత్యధికంగా పండిస్తారు. దేశంలో ఉత్పత్తి అయ్యే టమాట పంటలో ఈ నాలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 70 నుంచి 80% ఉత్పత్తి అవుతుంది. అయితే గడచిన సంవత్సర కాలంగా టమాటా పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. దీంతో రైతులు టమాటా పంట వేసేందుకు విముఖత చూపించారు. అలాగే సరైన గిట్టుబాటు ధర లభించక పోవడంతో, రైతులు టమాటా పంటకు రసాయనాలు ఎరువులు వాడేందుకు పెట్టుబడి కరువైంది. దీంతో చాలావరకు టమాటా పంట చీడపీడలకు గురైంది దీనికి తోడు పశ్చిమ రాష్ట్రాల్లో బిపర్జాయ్ తుఫాను ప్రభావంతో పంట దెబ్బతిన్నది ఫలితంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాదు టమాటా పంటపై రెండు రకాల వైరస్‌లు, CMV , ToMV దాడి చేయడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు,
అయితే ప్రస్తుతం నెమ్మదిగా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టమాటా పంట ఉత్పత్తి నెమ్మదిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నెమ్మదిగా ధరలు తగ్గుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో టమాట ఉత్పత్తి గడచిన రెండు వారాలుగా పోల్చినట్లయితే పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రైతులు అధిక ధరలను అవకాశంగా తీసుకుని ఉత్పత్తిని పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నై మార్కెట్లో 80 రూపాయలకే టమాటా లభిస్తోంది. మరోవైపుకు తమిళనాడు ప్రభుత్వం సబ్సిడీ రేట్లపై టమాటాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. ఇది కూడా టమాటా ధరలను తగ్గించేందుకు ఒక కారణం అయ్యింది.
ఇదిలా ఉంటే టమాటా ధరలను తగ్గించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రంగంలోకి తిరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రేట్లపై ఎరువులు, రసాయనాలు అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే ధరలు పూర్తిస్థాయిలో దిగివచ్చేందుకు మరింత సమయం పడుతుందని, రానున్న రెండు నెలల్లో కొత్త పంట చేతికి వస్తుందని మళ్లీ సాధారణ స్థితి నెలకొంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.