ఆకాశమే హద్దుగా: వడివడిగా పసిడి ధర పరుగులు

By rajesh yFirst Published Aug 9, 2019, 2:59 PM IST
Highlights

ఆకాశమే హద్దుగా పసిడి ధర వడివడిగా పెరుగుతోంది. గురువారం పది గ్రాముల బంగారం ధరను రూ.38,470కి పెరిగి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. మరోవైపు వెండి కిలో ధర కూడా రూ.44 వేలు దాటింది.

న్యూఢిల్లీ: పసిడి రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక స్థాయికి చేరుకుంటున్న ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్యయుద్ధం కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తున్నారు. 

దేశీయంగా ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో బంగారం ధర రూ.38 వేల మార్క్‌ను దాటింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి ధర మరో రూ.550 అందుకొని రూ.38,470కి చేరుకున్నది.

బుధవారం రూ.1,113 పెరిగిన బంగారం ధర ఆ మరుసటి రోజు కలుపుకొని రూ.1,663 అధికమైనట్లు కనిపించింది. బంగారంతోపాటు వెండి కూడా మరింత పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.630 అధికమై రూ.44,300కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1,500 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా భారీగా పుంజుకుంటున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పెట్టుబడిదారులు పసిడి వైపు మొగ్గుచూపడంతో గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ధర ఆరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందున్నారు. 

వీటికితోడు దేశీయ ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటం కూడా ధరలు పెరుగడానికి పరోక్షంగా కారణమైందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ హరీష్ వీ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వు బ్యాంక్ ప్రకటించిన మూడో ద్వైమాసిక సమీక్షలో భారత వృద్ధిరేటును 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది.

న్యూయార్క్ బులియన్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,497.40 డాలర్లకు పెరుగగా, వెండి 17.16 డాలర్ల వద్ద నిలిచింది. అవసరాల రీత్యా బంగారం కొనే వారు గానీ కొంత కాలం వేచి చూస్తే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

click me!