మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్లకు చమురు సెగ తగిలింది. పది గ్రాముల బంగారం సోమవారం 41 వేల మార్కును దాటింది. హైదరాబాద్ నగర బులియన్ మార్కెట్లో రూ.42,520 పలుకుతోంది.
న్యూఢిల్లీ/ముంబై: పసిడి కొండెక్కుతోంది. గల్ఫ్ ఉద్రిక్తతల ఫలితంగా పుత్తడి ధరలు సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని చేరుకున్నాయి. ఫలితంగా బంగారం ధరల భగభగలు మరింత పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయి రికార్డులను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ ట్రేడింగ్ లోనూ బంగారం ధర రూ.42 వేల మార్కును దాటేసింది. కిలో వెండి ధర రూ.49,200లకు చేరుకున్నది. కొన్ని నగరాల పరిధిలో కిలో వెండి ధర రూ.51 వేలు కూడా దాటింది.
also read చుక్కలను చూపిస్తున్న బంగారం ధరలు... మరింత పెరిగే అవకాశం...
undefined
ఈ నెల 26వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు ఉండటంతో బంగారం- వెండి కొనుగోలు చేయాలని భావిస్తున్న కుటుంబాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, కోయంబత్తూరు, మదురై నగరాల పరిధిలో తులం (10 గ్రాముల) బంగారం రూ.42,520తో జీవిత గరిష్ఠ స్థాయిని తాకింది.
సోమవారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.720 పెరిగి రూ.41,730కి చేరుకుంది. పుత్తడితోపాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర రూ.1,105 పెరుగుదలతో రూ.49,430కి చేరుకుంది. ముంబై మార్కెట్లో బంగారం రూ.750 పెరిగి రూ.40,842కి, వెండి రూ.625 ఎగబాకి రూ.47,955 కి చేరుకుంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్‌వర్గాలంటున్నాయి. ఈ పరిణామంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటం, మరోవైపు ఈక్విటీ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఇలాం టి తరుణంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పసిడిపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లింది.
also read ఆర్థిక సంవత్సరానికి తగ్గనున్నEPFO వడ్డీరేటు!
దాంతో అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ అనూహ్యంగా పుంజుకుంది. ఈ కారణంగా ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఔన్సు (31.1గ్రాములు) బంగారం ఒక దశలో 1,588 డాలర్లకు పెరిగింది. మళ్లీ 1,577 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి 18.41 డాలర్లు పలుకుతోంది. రాత్రి పది గంటల సమయానికి అంతర్జాతీయ ట్రేడింగ్‌లో ధరలు కాస్త తగ్గి రావడం ఊరట కలిగించే అంశం.