అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే వారం న్యూఢిల్లీ పర్యటనకు ముందు భారత్-అమెరికా ఫైటర్ జెట్ ఇంజిన్ ఒప్పందానికి అమెరికా పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
భారత వైమానిక దళం కోసం సంయుక్తంగా జెట్ ఇంజిన్‌లను తయారు చేసే చారిత్రాత్మక ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత వైమానిక దళం యొక్క లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ Mk 2 (తేజస్) ప్రోగ్రాం కోసం జెట్ ఇంజన్‌లను దేశీయంగా తయారు చేయడానికి సాంకేతికతను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)కి బదిలీ చేయడం ఈ ఒప్పందంలో ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), GE ఏరోనాటిక్స్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, భారతదేశంలో జెట్ ఇంజిన్ల తయారీ, లైసెన్సింగ్ ఏర్పాటు ఉన్నాయి.
భారతీయ వైమానిక దళం లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA)- MK-2 తేజస్ కోసం జెట్ ఇంజిన్‌ల సంయుక్త ఉత్పత్తి కోసం అమెరికన్ కంపెనీ GE ఏరోస్పేస్ HALతో జతకట్టింది. ఇది చారిత్రాత్మక ఒప్పందమని జీఈ ఏరోస్పేస్ సీఈవో హెచ్ లారెన్స్ కల్ప్ జూనియర్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం అత్యాధునిక ఎఫ్ 414 ఇంజన్లను భారతదేశంలో తయారు చేస్తారు.
వచ్చే నెల సెప్టెంబరులో జరగనున్న జి-20 సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి తరువాతి చర్యలను చర్చించాలని భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకు ఇరువైపుల నుంచి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశం ఉందని, నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై కీలక అడుగు పడింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జీఈ ఏరోస్పేస్, హెచ్ఏఎల్ మధ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు. ఈ సమయంలో ఈ ముఖ్యమైన ఒప్పందంపై కీలక అడుగు పడింది. .