నా వల్లే ఎలా దేశభద్రతకు ముప్పు: మెహుల్ ఛోక్సీ

By Arun Kumar PFirst Published 12, Sep 2018, 10:38 AM IST
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన ఆభరణాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ఎదురుదాడికి దిగారు. తనవల్ల దేశ భద్రతకు ముప్పెలా వాటిల్లుతుందని ప్రశ్నించారు. దాదాపు ఎనిమిది నెలల పాటు బయటకు కనిపించకుండా పోయిన ఛోక్సీ.. తన పాస్ పోర్ట్ రద్దు చేసినందున భారతదేశానికి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. 
 

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ ‌(పీఎన్బీ) కుంభకోణంలో తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, నిరాధారమైనవి అని వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అన్నారు. రూ. 13వేల కోట్ల పీఎన్‌బీ కుంభకోణం కేసులో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీతోపాటు మెహుల్‌ ఛోక్సీ కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ స్కాం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే దేశం విడిచి వెళ్లిపోయిన ఛోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఆశ్రయం పొందుతున్నారు. తొలిసారి ఆయన అక్కడి నుంచి వీడియో ద్వారా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. 

ఛోక్సీని లాయర్ ద్వారా ప్రముఖ మీడియా సంస్థ ఈ వీడియో ఇంటర్వ్యూ చేసింది. వీడియోలో సదరు వార్తాసంస్థ రూపొందించిన ప్రశ్నలను లాయర్‌ ఛోక్సీని అడిగితే వాటికి ఆయన జవాబిచ్చారు.
‘ఈడీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, నిరాధారం. నా ఆస్తులన్నీ అక్రమంగా జప్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 16న పాస్‌పోర్టు ఆఫీస్‌ నుంచి నాకు ఓ ఈ-మెయిల్‌ వచ్చింది. దేశ భద్రత వల్ల నా పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు అందులో ఉంది’ అని ఛోక్సీ చెప్పారు. 

‘దీంతో నా పాస్‌పోర్టు రద్దును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 20న ముంబైలోని ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీస్‌కు ఈ-మెయిల్‌ పంపాను. అయితే అక్కడి నుంచి నాకు ఎలాంటి జవాబు రాలేదు. కనీసం రద్దు చేయడానికి గల కారణాలు కూడా చెప్పలేదు. నా వల్ల దేశ భద్రతకు ముప్పు ఎలాగో తెలుపలేదు. నా పాస్‌పోర్టును రద్దు చేశారు గనుక లొంగిపోవడం అనే ప్రశ్నే లేదు’ ఛోక్సీ వీడియోలో అన్నారు.

ఈ ఏడాది జనవరి మొదటివారంలోనే ఛోక్సీ దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయనను స్వదేశానికి రప్పించేందుకు ఈడీ అధికారులు యత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయమై ఈడీ ఇంటర్‌పోల్‌ను కూడా ఆశ్రయించింది. ఛోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలంటూ ఈడీ అధికారులు సోమవారం కూడా ఇంటర్‌పోల్‌కు గుర్తుచేశారు. ఈ సమయంలో ఛోక్సీ వీడియో ద్వారా మీడియా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. గతేడాదిలో ఛోక్సీకి ఆంటిగ్వా పౌరసత్వం లభించింది.

ఇదిలా ఉంటే మెహుల్ ఛోక్సీ రూ.3250 కోట్ల విదేశీ నిధులను తన సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. తన ఔట్‌లెట్ల ద్వారా అత్యధిక ధరలకు వజ్రాభరణాలను విక్రయించాడని ఆరోపించింది. పలు డొల్ల సంస్థలను ఏర్పాటు చేసి నిధులను సొంత అవసరాలకు మళ్లించారని తెలిపింది. సుమారు రూ.400 కోట్లు రుణ నిధులను నీరవ్ మోదీకి, అతడి తండ్రి దీపక్ మోదీకి రూ.360 కోట్లు బదిలీ చేశారని వివరించింది. సదరు డొల్ల కంపెనీలు కేవలం క్రయ, విక్రయ బిల్లులు రూపొందించడం మినహా ఆభరణాలేమీ కదలలేదని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులో మెహుల్ ఛోక్సీ అధిక టర్నోవర్ చూపి బ్యాంకింగ్ అధికారులను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. 

Last Updated 19, Sep 2018, 9:23 AM IST