అమ్మో.. జెట్ ఎయిర్వేస్ మాటెత్తెద్దు.. ఎతిహాద్ నిర్వేదం

By rajesh yFirst Published Aug 13, 2019, 11:06 AM IST
Highlights

జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ఇచ్చిన రుణాలు వసూలు చేసుకోవచ్చునని భావిస్తున్న బ్యాంకర్ల ఆశలు అడియాసలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మైనారిటీ వాటాదారుగా ఉన్న ఎతిహాద్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదనపు పెట్టుబడులు పెట్టలేమని తేల్చేసింది. ఇక అనిల్ అగర్వాల్ అనే మరో పారిశ్రామిక వేత్త తన బిడ్డింగ్ ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

ముంబై: నిధులు లేక మూతపడిన జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేయడానికి గతంలో ముందుకొచ్చిన ఒక్కోక్కరు జారుకుంటున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుని గత ఏప్రిల్ నెల 17వ తేదీన నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ సంస్థలో తిరిగి పెట్టుబడులు పెట్టే అంశంపై గల్ప్ వైమానిక సంస్థ ఎతిహాద్ సోమవారం కీలక ప్రకటన చేసింది.

సంక్షోభంలో ఉన్న జెట్ఎయిర్వేస్‌లో మళ్లీ పెట్టుబడులు పెట్టబోమని పేర్కొంది. పరిష్కారం కాని సమస్యలు, రుణాల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నామని పేర్కొంది. ప్రస్తుతం దీనిపై దివాళా ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దాదాపు మూడు కంపెనీలు ప్రాథమికంగా బిడ్స్ను దాఖలు చేశాయి.

ఈ నేపథ్యంలో తాము ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ను దాఖలు చేయలేదని వెల్లడించారు.  ప్రస్తుతం ఈ డీల్కు సంబంధించిన ఈవోఐలను దాఖలు చేయడానికి ఈ నెల 10వ తేదీతో ముగిసింది. 

‘జెట్ ఎయిర్వేస్‌లో పెట్టుబడి పెట్టడం ఎతిహాద్ బాధ్యత కాదు.. లాభదాయకం అంతకంటే కాదు.. భారత్‌కు ఇచ్చిన హామీపై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదు. జెట్‌కు సరైన పరిష్కారం చూపాలని కోరుతున్నాం. మైనార్టీ షేర్ హోల్డర్ అయిన ఎతిహాద్‌కు అంత సామర్థ్యం లేదు’ అని ఎతిహాద్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

గతంలో జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి బిడ్డింగ్‌ను దాఖలు చేసిన ప్రముఖ మైనింగ్ దిగ్గజం అధినేత అనిల్ అగర్వాల్..తాజాగా సోమవారం ఈ బిడ్డింగ్ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎతిహాద్ ఎయిర్‌వేస్, హిందుజా గ్రూప్‌లూ జెట్ కొనుగోలుకు మొదట్లో ఆసక్తి చూపినా.. ఆ తర్వాత వెనుకకు తగ్గాయి.

తొలి విడుత నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియ చివరి తేదీని ఈ నెల 3 నుంచి 10 వరకు పెంచినా ఏ సంస్థ కూడా ముందుకురాలేదు. జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్ కూడా రెండో రౌండ్‌లో పాల్గొంటుందని అందరు ఆశించారు, కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది.

click me!