క్రూడాయిల్‌తో మళ్లీ నీరసం.. ఐఎల్ఎఫ్ఎస్ మాజీ చైర్మన్ అరెస్ట్

By Siva KodatiFirst Published Apr 2, 2019, 10:43 AM IST
Highlights

ఎనిమిది కీలక రంగాల పరిశ్రమల్లో ఫిబ్రవరిలో కేవలం 2.1 శాతం వ్రుద్ది మాత్రమే నమోదైంది. గతేడాది ఇదే నెలలో 5.4 శాతం పురోగతి నమోదు చేసుకోవడం గమనార్హం.  

కీలక రంగాల్లో మళ్లీ నీరసం ఆవరించింది. క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తుల్లో నెలకొన్న మందకొడి వల్ల ఫిబ్రవరి నెలకు కీలక రంగాల్లో వృద్ధి 2.1 శాతానికి పరిమితమైంది. కేంద్ర వాణిజ్య, మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ సంగతి తేల్చి చెప్పింది.

బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ కలిగిన ఈ ఎనిమిది కీలక రంగాలు అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.4 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గింది. 

క్రూడాయిల్ ఉత్పత్తి 6.1 శాతానికి పరిమితమవగా, రిఫైనరీ ఉత్పత్తి 0.8 శాతంగా నమోదైంది. ఎరువుల్లో వృద్ధి 2.5 శాతంగా ఉండగా, స్టీల్‌లో 4.9 శాతం, సిమెంట్‌లో 8 శాతం, విద్యుత్ 0.7 శాతంతో సరిపెట్టుకున్నది. గతేడాది నమోదైన గణాంకాలతో పోలిస్తే భారీగా తగ్గాయి.

కానీ, బొగ్గు ఉత్పత్తి 7.3 శాతానికి పెరుగగా, సహజ వాయువు ఉత్పత్తి 3.8 శాతంగా నమోదైంది. కీలక రంగాల్లో నెలకొన్న నిస్తేజంతో పారిశ్రామిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్యకాలానికి కీలక రంగాల్లో వృద్ధి 4.3 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

ఎస్ఎఫ్ఐఓ అదుపులో ఐఎల్ఎఫ్ఎస్ మాజీ చైర్మన్
సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మాజీ చైర్మన్ హరి శంకరన్ అరెస్ట్ అయ్యారు. మోసపూరిత చర్యలకు పాల్పడి నందుకు, సంస్థకు ఆర్థికంగా నష్టాలు కలిగించినందుకు ఆయనను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్‌గేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐవో) వర్గాలు తెలిపాయి.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో అరస్టైన తొలి వ్యక్తి శంకరన్. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్న శంకరన్..ఈ నెల 4 వరకు కస్టడీలో ఉంటారు. 

click me!