వైవీ రెడ్డి షాక్: జంట పెత్తనంతోనే బ్యాంకుల కష్టాలు

By narsimha lodeFirst Published Oct 7, 2018, 4:28 PM IST
Highlights

మొండి బకాయిలతో బ్యాంకింగ్‌ రంగం జంట పెత్తనాల సమస్యను ఎదుర్కొంటున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి పేర్కొన్నారు

హైదరాబాద్‌: మొండి బకాయిలతో బ్యాంకింగ్‌ రంగం జంట పెత్తనాల సమస్యను ఎదుర్కొంటున్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి పేర్కొన్నారు. దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చెరో వైపు నియంత్రిస్తుండటమే  సమస్యకు మూలమవుతోందని ఆర్బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి అన్నారు. ఆర్బిఐకి సర్వాధికారాలు ఉన్నాయని కేంద్రం అంటున్నా, ఆర్‌బీఐ మాత్రం తగిన నియంత్రణ అధికారాలే లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నదన్నారు. ప్రభుత్వం, ఆర్బిఐ అంగీకరించినా, అంగీకరించకపోయినా.. బ్యాంకింగ్ రంగంపై ద్వంద్వ నియంత్రణ ఉందన్న మాట మాత్రం వాస్తవమని వైవి రెడ్డి కుండ బద్ధలు కొట్టారు.

ఇలాంటి విధానికి స్వస్తి పలకాలని 20 ఏళ్ల క్రితమే నరసింహన్ కమిటీ సూచించినా ఇప్పటి వరకు ఇది మాత్రం జరగలేదని ఆయన అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో శనివారం జరిగిన వార్షిక ఆర్థిక సమావేశం- అర్ధ 2018లో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల అధికార పరిధిలోకి ప్రవేశించేందుకు బ్యాంకులను ఆయుధంగా మలచుకుంటున్నాయన్నారు. రాజకీయ ఆర్థిక వ్యవస్థ మరో సమస్యగా మారిందన్నారు. ప్రస్తుతం చాలా మంది ఎంపీలు వ్యాపారవేత్తలుగా ఉన్నారని చెప్పారు. 
 
దేశ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా రానున్న కాలంలో ఇది మరింతగా తగ్గే అవకాశం ఉందని  ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి అన్నారు. తాను ఆర్బిఐ గవర్నర్గా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించిందని, ఇందులో తానూ అయిష్టంగా భాగస్వామినయ్యానని చెప్పారు. రాష్ర్టాల వ్యవసాయ రుణ మాఫీకన్నా కేంద్ర రుణ మాఫీ ప్రమాదకరమని అభిప్రాయ పడ్డారు. దేశవ్యాప్తంగా రైతులంతా నష్టాల పాలయ్యే అవకాశం ఉండదన్నారు. ప్రస్తుతం బ్యాంకుల నుంచి పది శాతం మంది రైతులే రుణాలు పొందుతున్నారన్నారు. రాజకీయాల ప్రమేయంతో రూపొందించే విధానాల వల్ల వ్యవసాయ రంగంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. 

నీటి లభ్యత, విత్తనాల నాణ్యత, ఎరువుల నాణ్యత, కనీస మద్దతు ధర, ఎగుమతుల విధానం తదితర విషయంలో అనిశ్చితి నెలకొంటోందని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో నిశ్శబ్ద విప్లవం సాగుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని, దీనికి మండల్ కమిషన్ దోహదపడుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి చెప్పారు. భవిష్యత్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ర్టాలు భారీ వృద్ధిని సాధించే అవకాశం ఉందన్నారు.
 

click me!