టాప్‌గేర్‌లో ట్రంప్.. సుంకాలతో అల్లాడుతున్న ‘డ్రాగన్’!

By Siva KodatiFirst Published May 12, 2019, 10:44 AM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది సాధిస్తారని పేరుంది. అందుకు ఎటువంటి సాహసానికైనా ముందుకెళతారు. వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు చైనా- అమెరికా మధ్య చర్చలు పూర్తయిన వెంటనే అన్ని చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేయడమే దీనికి నిదర్శనం.
 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బిజినెస్ వ్యూహం అమలులో తనకు తానే సాటి. బేరం చేయడంలో ఆయన స్టైలేవేరు.. చర్చల చివరి దశలో తెగదెంపులకైనా సిద్ధపడి తాను అనుకున్నది సాధిస్తారు.

గతంలో యూఎస్‌-మెక్సికో-కెనడా (యూఎస్‌ఎంసీఏ)ఒప్పందం సమయంలో తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముగింపు పలికేలా ఓ ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరాక ఇప్పుడు సుంకాల కొరడా ఝుళిపించారు. 

ఫలితంగా 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులకు అదనపు సుంకాలు అంటుకున్నాయి. ఇందులో అమెరికాకు పోయేదేమీ లేదు.. చైనాకు అమెరికా ఎగుమతులు 120 బిలియన్‌ డాలర్లను దాటవు.. వాటిలో కూడా 91శాతంపై  ఇప్పటికే సుంకాలు ఉన్నాయి.

దీనిపై చైనా లబోదిబోమని కొట్టుకుంటోంది. ఇప్పుడు చర్చలు పూర్తిగా అమెరికా వైపు మొగ్గేలా బ్రహ్మస్త్రం ప్రయోగించారు. తాజాగా చైనా నుంచి దిగుమతి అయ్యే పలు రకాల ఉత్పత్తులపై ఇప్పటికే సుంకం పెంచిన అమెరికా.. మిగిలిన అన్ని ఉత్పత్తులకూ టారీఫ్‌ పెంపును వర్తింపజేయాలని నిర్ణయించింది.

చైనా మిగిలిన దిగుమతులపైనా సుంకం పెంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరుదేశాల మధ్య జరిగిన తాజా చర్చలు ఎలాంటి ఒప్పందం జరగకుండానే ముగిశాయి.

ఆ వెంటనే చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులన్నింటిపై సుంకాలు విధించాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనికి ఒక రోజు ముందు 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై దిగుమతి టారీఫ్‌లను కూడా 10 శాతం నుంచి 25 శాతానికి అమెరికా పెంచింది.

ట్రంప్‌ తాజా ఆదేశాల నేపథ్యంలో చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే మిగిలిన మిగిలిన దిగుమతులపైనా సుంకం పెంచే ప్రక్రియను ప్రారంభించాలని ట్రంప్‌ ఆదేశాలిచ్చారని అమెరికా వాణిజ్య మంత్రి రోబర్ట్‌ లైట్జర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వీటి విలువ 300 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారంతో ముగిసిన చర్చల్లోనూ అమెరికా-చైనాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోయాయి. అయితే చర్చలు విఫలం కాలేదని, ఒప్పందం ఖరారు చేసుకునే విషయంలో ఆచితూచి ముందుకెళ్తున్నట్లు చైనా పేర్కొంది.

ఇప్పటివరకు 11 విడతల్లో చర్చలు జరిగాయి. చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి సమావేశం కావాలని ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయన్నారు. 

ఓవైపు అమెరికాతో సంప్రదింపులు ఇంకా ముగియలేదని చైనా చెబుతున్నా.. ఇటీవల విఫలమైన చర్చలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ మాత్రం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. 

కాగా, తాజా నిర్ణయంతో అదనంగా సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రభావం పడనున్నది. మరోవైపు చైనా సైతం ప్రతీకార సుంకాలకు దిగే వీలుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే జరిగితే అమెరికా-చైనా సుంకాల పోరు.. ప్రపంచ దేశాలను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 

click me!