పోర్ట్ డెవలప్‌మెంట్ పేర బ్యాంకులకు రూ.3500 కోట్ల శఠగోపం!

By rajesh yFirst Published Jun 6, 2019, 11:36 AM IST
Highlights


బ్యాంకులకు రుణాల ఎగనామం బెట్టిన కార్పొరేట్ అధినేతల జాబితాలో మరొక పారిశ్రామిక వేత్త చేరారు. బాలాజీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత విజయ్ కలంత్రీ ఆయన కొడుకు కలిసి ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద   దిఘీ పోర్టు అభివృద్ధి పేరుతో రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు తీర్చే సామర్థ్యం ఉన్నా ఎగవేతకు పాల్పడినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (విజయాబ్యాంక్) ఉద్దేశపూర్వక ఎగవేతదారుడని పేర్కొంటూ విజయ్ కలంత్రీపై నోటీసు జారీ చేసింది. కానీ తానేమీ తప్పెరుగనని, పొరపాటుగా తనను ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా చిత్రీకరించారని విజయ్ కలంత్రీ సెలవిచ్చారు. 

 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి భారీగా రుణాలు పొంది ఎగవేసిన బడాబాబుల జాబితాలో తాజాగా మరో పారిశ్రామికవేత్త  చేరారు. బాలాజీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ అధినేత, దిఘిపోర్టు డెవలపర్‌ విజయ్ గోవర్థన్‌దాస్‌ కలంత్రీ, ఆయన కుమారుడు వికాస్ కలంత్రీ కలిసి బ్యాంకులకు దాదాపు రూ.3,334 కోట్ల మేర రుణాలను ఎగవేతకు పాల్పడ్డారు. 

దిఘీ పోర్టు అభివృద్ధి పేరుతో వీరు దాదాపు 16 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.3500 కోట్ల మేర రుణాలను సమీకరించి.. ఆ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించడం లేదని రుణాలు జారీ చేసిన బ్యాంకర్ల కన్సార్టియంకు సారథ్యం వహిస్తున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (పూర్వపు విజయా బ్యాంక్‌) తెలిపింది. 

ఈ నేపథ్యంలో దిఘి పోర్టు చైర్మెన్ కం మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్ గోవర్థన్‌దాస్‌ కలంత్రీ, పోర్టు డైరెక్టర్‌ అయిన ఆయన కుమారుడు విశాల్‌ కలంత్రీలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ విషయమైముంబై స్థానిక వార్తా పత్రికల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒక పబ్లిక్‌ నోటీసును వెలువరించింది. 

ఆర్బీఐ నిర్ధేశించిన నిబంధనల మేరకు బ్యాంక్‌ నిబంధనల అనుసారం రుణం తీసుకున్న సంస్థ దిఘి పోర్టు , దానికి పూచీకత్తుగా ఉన్న దిఘీ పోర్టు డైరెక్టర్లు విశాల్‌ విజయ్ కలంత్రీ, విజయ్ గోవర్థన్‌దాస్‌ కలంత్రీ బ్యాంకుల నుంచి రుణాలను స్వీకరించి ఉద్దేశపూర్వకంగా వాటిని చెల్లించడం లేదని ప్రకటించింది. ఈ విషయమై వారికి సంబంధిత సమాచారం అందించినా వారు తగిన చర్యలు తీసుకోవడం లేదని బ్యాంక్‌ వర్గాలు ఆ ప్రకటనలో తెలిపాయి. 

ఆర్బీఐ నిబంధనల మేరకు ఎగవేత అంశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలిపేందుకు బ్యాంక్‌ వర్గాలు వీరి ఫొటోలను కూడా ప్రచురించడం గమనార్హం. రాజ్‌పురి క్రీక్స్‌ తీరాన్ని కేంద్రంగా చేసుకొని దిఘీ పోర్టును అభివృద్ధి చేసేందుకు కలంత్రీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలను స్వీకరించారు. 

దిఘీ పోర్టును అత్యాధునిక ఉపకరణాలు టెక్నాలజీతో దీనిని అభివృద్ధి పరిచారు. అయితే అనుకున్న స్థాయిలో డిమాండ్‌ ఏర్పడకపోవడంతో ఈ పోర్టు దివాలా బాట పట్టింది. గత ఏడాది మార్చి 25న ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ ముందుకు దిఘీ పోర్టు దివాలా అంశం విచారణకు వచ్చింది. 

ఈ పోర్టు పునరుద్ధరణకు జెఎన్‌పీటీ సమర్పించిన ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ సమ్మతి తెలిపింది. దీంతో పోర్టు జెఎన్‌పీటీ చేతుల్లోకి చేరింది. వివిధ పెద్దపెద్ద నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్న కలంత్రీని ఇప్పడు బ్యాంకులు మోసగాడిగా గుర్తించడంతో కార్పొరేట్‌ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది.

కానీ తనకు ఏ పాపం తెలియదని విజయ్ కలంత్రీ పేర్కొన్నారు. తప్పుగా తనపై ‘ఉద్దేశపూర్వక’ ఎగవేతదారు ముద్ర వేశారని వివరించారు. తానేమీ నిధులు దారి మళ్లించ లేదన్నారు. దిఘి పోర్టు అభివ్రుద్ధి ప్రాజెక్టును డెవలప్ చేసేందుకు బాలాజీ ఇన్ ఫ్రా, ఐఎల్ఎఫ్ఎస్ సంస్థలకు సంయుక్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. విజయ్ కలంత్రీ తనపై అతిగా స్పందించిందన్నారు.

click me!