Delhivery shares listing: అదరగొట్టిన డెలివరీ ఐపీవో లిస్టింగ్, ఒక్కో షేరుపై 50 రూపాయల లాభం..

By team teluguFirst Published May 24, 2022, 5:08 PM IST
Highlights

Delhivery shares listing:  స్టాక్ మార్కెట్లలో ఈ రోజు రెండు ఐపీవోలు లిస్ట్ అయ్యాయి. వాటిలో వీనస్ పైప్స్ మదుపరులకు లిస్టింగ్ లాభాలు అందించగా, అంతగా అంచనాలు లేని డెలివరీ ఐపీవో సైతం మదుపరులకు ఊహించని విధంగా లాభాలను తెచ్చిపెట్టింది. కేవలం 1.5 శాతం మాత్రమే ప్రీమియం రిటర్న్ ఇచ్చినప్పటికీ, కంపెనీ షేర్లు మార్కెట్ ముగిసే సమయానికి ఏకంగా లిస్టింగ్ ధర కన్నా ఒక్కో షేరుపై 50 రూపాయల లాభాన్ని అందించింది.

Delhivery shares listing:  డెలివరీ ఐపీఓ లిస్టింగ్ బంపర్ హిట్ అయ్యింది. ఎల్ఐసీతో డీలా పడ్డ ప్రైమరీ మార్కెట్లో మదుపురులకు డెలివరీ లిస్టింగ్ లాభాలను అందించింది. నిజానికి డెలివరీ ఐపీవో లిస్టింగ్ సమయంలో కేవలం 1.5 శాతం ప్రీమియం రిటర్న్న్ మాత్రమే ఇచ్చింది. కానీ లిస్ట్ అయ్యాక మాత్రం షేర్లు బౌన్స్ బ్యాక్ అయి అప్పర్ సర్క్యూట్ తాకాయి. డెలివరీ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ.462 నుంచి 487 రూపాయలు. కాగా 490 రూపాయల వద్ద  షేర్లు లిస్ట్ అయ్యాయి. 

నిజానికి డెలివరీ ఐపీవో లిస్టింగ్ కు  ముందు, గ్రే-మార్కెట్ నుండి ఎటువంటి మంచి సంకేతాలు రాలేదు. దీంతో ఇష్యూ ధర కంటే తక్కువ ధరకే లిస్ట్ అవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా  డెలివరీ ఐపీవో ఇష్యూ ధర కంటే ఎక్కువకే లిస్ట్ అయ్యింది. 

డెలివరీ ఇష్యూ ధర రూ.487 కాగా, ఈ స్టాక్ BSEలో రూ. 493 వద్ద లిస్ట్ అవగా, NSEలో రూ. 495.20 వద్ద లిస్ట్ అయ్యింది.  మార్కెట్ ముగిసే సమయానికి డెలివరీ షేర్లు 8.29 శాతం లాభంతో 536.25 వద్ద ముగిశాయి. అంటే మదుపరులకు దాదాపు ఇష్యూ ధరకన్నా 50 రూపాయల లాభం దక్కింది. 

నిజానికి డెలివరీ ఐపీవోకు మొదటి రోజు నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో కంపెనీకి లిస్టింగ్ భయం ఉన్న నేపథ్యంలో, కంపెనీ తన ఇష్యూ పరిమాణాన్ని కూడా తగ్గించుకుంది. ఇంతకుముందు కంపెనీ రూ.7,460 కోట్లను సమీకరించాలని భావించగా, తర్వాత ఇష్యూ పరిమాణం రూ.5,235 కోట్లకు తగ్గించింది.

ఈ IPO కోసం దరఖాస్తు చేసుకోవడానికి మే 13 చివరి రోజు కాగా, ఆ రోజు వరకు ఇది 1.63 సార్లు సబ్ స్క్రిప్షన్ పొందింది. NSE డేటా ప్రకారం, మొత్తం 6,25,41,023 షేర్లకు గానూ, 10,17,04,080 బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ మదుపరుల వాటా 2.66 రెట్లు భర్తీ కాగా, రిటైల్ కేటగిరీలో 57 శాతం మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లలో 30 శాతం మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 

కంపెనీకి లాభాలు లేవు...అయినప్పటికీ లిస్టింగ్ లాభాలు...
డిసెంబర్ 2021తో ముగిసిన 9 నెలల్లో కంపెనీ రూ. 891.14 కోట్ల నష్టాన్ని చవిచూసింది. FY21లో రూ. 416 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. డిసెంబర్ చివరి నాటికి కంపెనీ ఆదాయాలు రూ.4,911 కోట్లకు చేరుకోగా, ఎఫ్‌వై21కి రూ. 3,838గా ఉన్నాయి.

అదే సమయంలో ఇంధన ధరలు పెరగడంతో, ఖర్చు గణనీయంగా పెరిగింది. ఇది 2020లో రూ. 2,026 నుండి 2021లో రూ. 3,480 కోట్లకు పెరిగింది, అయితే 2022 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో రూ. 4,000 కోట్లకు చేరుకుంది.

అటు ఇదే రోజు లిస్ట్ అయిన వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఎనిమిది శాతం వరకు రిటర్న్స్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు. వీటి ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

click me!