వేటుపై పోరుకు చందాకొచ్చర్.. బాంబే హైకోర్టులో పిటిషన్

By Siva KodatiFirst Published Dec 1, 2019, 3:09 PM IST
Highlights

ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్ న్యాయ పోరాటానికి దిగారు. తనపై వేటును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఆ సంస్థ మాజీ సీఈవో చందా కొచ్చర్ న్యాయ పోరాటానికి దిగారు. తనపై వేటును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. తన ముందస్తు పదవీ విరమణకు బ్యాంక్ అంగీకరించిన నేపథ్యంలో మళ్లీ ఈ వేటు ఏమిటంటూ కొచ్చర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణను జస్టిస్‌లు రంజిత్ మోరే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్‌లతో కూడిన ధర్మాసనం సోమవారానికివాయిదా వేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ తన ముందస్తు రిటైర్మెంట్‌ను ఆమోదించిందని, ఆ తర్వాతే తన స్థానంలో సందీప్ బక్షీని నియమించిందని కొచ్చర్ న్యాయస్థానానికి గుర్తుచేశారు.

Also read:2019 ఆర్థిక సంవత్సరంలో ‘బిగ్‌ బాస్కెట్‌’కు పెరిగిన నష్టాలు

గతేడాది అక్టోబర్‌లో తన రిటైర్మెంట్ విజ్ఞప్తిని బ్యాంక్ అంగీకరించిందన్న ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ తొలగింపు లేఖను బ్యాంక్ జారీ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలోనే పరిహారం చెల్లించబోనని స్పష్టం చేశారు. తనపై వేటు వేయడం సరికాదన్న కొచ్చర్.. ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి అనుమతి లేకుండానే తనను తొలగిస్తున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించిందని, ఇది కూడా చట్టాల ఉల్లంఘనేనని పేర్కొన్నారు. నిరుడు నవంబర్ 3న ఐసీఐసీఐ బ్యాంక్‌కు చందా కొచ్చర్.. ముందస్తు రిటైర్మెంట్ విజ్ఞప్తిని చేశారని, అక్టోబర్ 4 నుంచే అమల్లోకి వచ్చేలా ప్రకటించాలని కోరారని సంబంధిత వర్గాల సమాచారం. ఇందుకు బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అంగీకారం తెలిపారని తెలుస్తున్నది. 

చందాకొచ్చర్ ముడుపుల వ్యవహారంపై మాజీ న్యాయమూర్తి బీఎన్ శ్రీకృష్ణ నుంచి దర్యాప్తు నివేదికను అందుకున్న బ్యాంక్.. కొచ్చర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే 2009 ఏప్రిల్ నుంచి 2018 మార్చిదాకా తీసుకున్న అన్ని రకాల బోనస్ చెల్లింపులను తిరిగిచ్చేయాలని ఐసీఐసీఐ ఆదేశించింది. 

బ్యాంక్ అంతర్గత విచారణలో కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు రుజువైనందున, అక్టోబర్ నాటి నిష్క్రమణను సాధారణ రాజీనామాగా భావించలేమని, తొలగింపుగానే చూడాల్సి వస్తున్నదని ఐసీఐసీఐ వర్గాలు తెలియజేశాయి. దీంతో మొత్తం రూ.7.4 కోట్లు ఇవ్వాలని తేల్చిచెప్పాయి. 

అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న చందాకొచ్చర్ కోర్టు గడప తొక్కారు. నివేదిక రాకముందే తాను రిటైర్ అయ్యానని వాదిస్తున్నారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. 

కొచ్చర్ తరఫున ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు విక్రమ్ నన్కానీ, సుజయ్ కాంతవాలా వాదిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది డారియస్ ఖంబాట, న్యాయ సంస్థ వెరిటాస్ లీగల్ పోరాడుతున్నాయి. 

Also read:టాప్-10 అత్యంత ధనవంతుల్లో ముకేష్ అంబాని...

వీడియోకాన్ గ్రూప్‌నకు రుణ మంజూరు విషయంలో చందా కొచ్చర్ అవినీతికి పాల్పడ్డారని, తన భర్త దీపక్ కొచ్చర్ సంస్థలో వీడియోకాన్ అధినేత ధూత్ పెట్టుబడులు పెట్టారని ఐసీఐసీఐ బ్యాంక్ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొచ్చర్‌పై వేటు పడగా, వీడియోకాన్ రుణాలు మొండి బకాయిలుగా మారాయని బ్యాంక్ ప్రకటించింది.

click me!